Farmer DISCOM: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రైతు విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఆర్పీడీసీఎల్)కు విద్యుత్ పంపిణీ లైసెన్స్‌ను మంజూరు చేస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులు, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్, మున్సిపల్ నీటి సరఫరా కనెక్షన్లకు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నూతన సంస్థను ఏర్పాటు చేసింది.
ఈ ఏడాది ఉగాది రోజున అంటే మార్చి 19న టీజీఆర్పీడీసీఎల్ లైసెన్స్ కోసం ఈఆర్సీకి దరఖాస్తు చేసింది. ఈ లైసెన్స్ దరఖాస్తుపై మే 29 న బహిరంగ విచారణ నిర్వహించిన ఈఆర్సీ విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ, రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వినియోగదారుల సంస్థలు, విద్యుత్ రంగ నిపుణులు తమ అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన కమిషన్ ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 14తో పాటు సెక్షన్ 131 ప్రకారం లైసెన్స్ మంజూరు చేసింది.
వ్యవసాయ రంగానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ సరఫరా విధానం నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని కమిషన్ పేర్కొంది. రైతులకు సంబంధించిన పంపుసెట్లకు ఎలాంటి వ్యక్తిగత మీటర్లను అమర్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. కేవలం మెరుగైన సేవలందించడం, విద్యుత్ లెక్కలను సరిచూడటం కోసమే ఈ ప్రత్యేక సంస్థను పునర్వ్యవస్థీకరించినట్లు స్పష్టం చేసింది.
ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి నాలుగు నెలల తర్వాత టీజీఆర్పీడీసీఎల్ తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించనుంది. ప్రభుత్వం నుంచి చట్టబద్ధమైన బదిలీ పథకం(స్టాట్యుటరీ ట్రాన్స్‌ఫర్ స్కీమ్) విడుదలైన తర్వాత ఈ లైసెన్స్ అమలులోకి వస్తుంది. విద్యుత్ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ దాఖలు చేసిన దరఖాస్తులను కూడా కమిషన్ ఆమోదించింది. టీజీఆర్పీడీసీఎల్ కార్యకలాపాలు ప్రారంభమైన తేదీ నుంచి బదిలీ అయ్యే వినియోగదారుల వర్గాలను ఈ రెండు డిస్కంల పరిధి నుంచి తొలగిస్తూ వాటి లైసెన్సులను సవరించింది. అయితే, పాత డిస్కంల భౌగోళిక ప్రాంతాలు, ఇతర వినియోగదారులపై వాటి బాధ్యతల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేసింది.
ఈ బదిలీ ప్రక్రియ సాగుతున్న సమయంలో కొత్త వ్యవసాయ లేదా ఇతర కనెక్షన్ల జారీని నిలిపివేయడం గానీ, ఆలస్యం చేయడం గానీ చేయకూడదని కమిషన్ ఆదేశించింది. కొత్త సంస్థ పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టే వరకు పాత డిస్కంలే దరఖాస్తులను స్వీకరించి కనెక్షన్లు ఇస్తాయి. వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం టీజీఆర్పీడీసీఎల్ సొంతంగా కనీసం వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికలను(కన్స్యూమర్ గ్రీవెన్స్) ఏర్పాటు చేయాలని, అంతవరకు ప్రస్తుత డిస్కంల ఫోరమ్‌లే రైతు డిస్రకరం వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరిస్తాయని ఈఆర్సీ వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 131 ప్రకారం ట్రాన్స్ ఫర్ స్కీమ్ జారీ చేసి సంబంధిత ఆస్తులు, అప్పులు, వినియోగదారులను రైతు డిస్కంకు బదిలీ చేయాలి. టీజీఆర్పీడీసీఎల్ మూడు నెలల్లో లోడ్ అంచనాలు, లైన్ నష్టాల తగ్గింపు, ఇంటర్ఫేస్ మీటరింగ్, సిబ్బంది, ఆర్థిక అంశాలతో కూడిన సమగ్ర వ్యాపార ప్రణాళికను కమిషన్ కు సమర్పించాలని కమిషన్ స్పష్టంచేసింది. రైతు డిస్కం, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ మధ్య ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, వినియోగదారుల డేటా బదిలీ, విద్యుత్ సరఫరా, ఎనర్జీ అకౌంటింగ్ తదితర అంశాలపై అవగాహన ఒప్పందాలు, సేవా ఒప్పందాలు, బల్క్ సప్లయ్ ఒప్పందాలు కుదుర్చుకుని కమిషన్ ఆమోదానికి సమర్పించాలని ఈఆర్సీ ఆదేశించింది.
Also read: TGSPDCL: ఈ దారుణాలకు బాధ్యులెవరు.. వణుకు పుట్టిస్తున్న విద్యుత్ శాఖ రిపోర్ట్..!
డిప్యూటేషన్ లేదా బదిలీల ద్వారా కొత్త సంస్థలోకి వచ్చే ఉద్యోగుల హక్కులు, సీనియారిటీ, పెన్షన్, రిజర్వేషన్ రోస్టర్, పదోన్నతి అవకాశాలకు ఎలాంటి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ హామీని కమిషన్ తన ఉత్తర్వుల్లో నమోదు చేసింది. టీజీఆర్పీడీసీఎల్ కూడా ఇతర డిస్కంల మాదిరిగానే టారిఫ్, సేవా ప్రమాణాలు, వినియోగదారుల హక్కులు, నివేదికల సమర్పణ తదితర అన్ని అంశాల్లో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి పర్యవేక్షణలో పనిచేస్తుందని ఈఆర్సీ వెల్లడించింది.
మార్పిడి ప్రక్రియను కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే ప్రజాహిత దృష్ట్యా మరిన్ని ఆదేశాలు జారీ చేస్తుందని స్పష్టంచేసింది. 2026-27 ఆర్థిక సంవత్సర మిగిలిన కాలానికి టారిఫ్, ప్రభుత్వ సబ్సిడీ పంపిణీపై డిస్కంలు కమిషన్ ను ఆశ్రయించాలని ఈఆర్సీ స్పష్టం చేసింది. అలాగే మూడు నెలల్లోగా సమగ్ర బిజినెస్ ప్లాన్‌ను సమర్పించాలని, నవంబర్ 30 నాటికి రాబోయే ఆర్థిక సంవత్సరానికి(2027-28) సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలను దాఖలు చేయాలని డిస్కంలను ఈఆర్సీ ఆదేశించింది.
Also read: Water Tourism: ఇక గోవా వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో నీటిపై తేలియాడే రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా..!