Telangana Budget: హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ప్రజలకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఆశలు అడియాశలయ్యాయి. రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27) రాష్ట్ర బడ్జెట్ లో జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మాల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కలిపి సుమారు రూ. 9700 కోట్లను కేటాయించాలని ఇదివరకే సర్కారుకు జీహెచ్ఎంసీ ప్రతిపాదనలను పంపింది. రాష్ట్ర మున్సిపల్ శాఖకు రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో సర్కారు రూ. 17,907 కోట్లు కేటాయింపులు జరిపింది. ఇందులో వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) లో మాదిరిగానే క్యూర్ పరిధిలో ట్రాఫిక్ సమస్య కు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులకు రూ. 2654 ను కేటాయించింది. బడ్జెట్ లో కోర్ అర్బన్ రీజియన్ లో హెచ్ సిటీ పనుల మినహా ఎక్కడా కూడా మూడు కార్పొరేషన్ల ప్రస్తావన రాకపోవటంతో ఈ కార్పొరేషన్ల లో మున్ముందు ఆర్థికంగా గడ్డుకాలం పొంచి ఉందని భావించవచ్చు.
జీహెచ్ఎంసీ పునర్వవస్థీకరణ చేయకముందు పంపిన రూ. 9,700 కోట్లను సర్కారు కేటాయింపులు జరిపితే జీహెచ్ఎంసీకి రూ.5 వేల కోట్లు, మిగిలిన నాలుగున్నర వేల కోట్లను సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కేటాయించాలని మున్సిపల్ శాఖ అధికారులు భావించారు. కానీ సర్కారు బడ్జెట్ లో కేవలం హెచ్ సిటీ పనులకు మినహా మిగిలిన ఏ ప్రాజెక్టుకు గానీ కేటాయింపులు జరపలేదు. మూడు కార్పొరేషన్లకు కలిపి కాకపోయినా విడివిడిగానైన సర్కారు నిధులు కేటాయిస్తుందని అధికారులు వేసిన అంచనాలన్నీ తారుమారయ్యాయి.
గత సంవత్సరం నవంబర్ 25న కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసిన తర్వాత.. గత నెల 11వ తేదీన మూడు కార్పొరేషన్లుగా పునర్విభజించినా నాటి నుంచి నేటి వరకు జీహెచ్ఎంసీ అకౌంట్ లోనే మూడు కార్పొరేషన్ల ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల జీతభత్యాలను కూడా జీహెచ్ఎంసీ చెల్లిస్తూ వస్తోంది. తొలుత ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చి వరకు మాత్రమే చెల్లించాలని భావించినా, ఏప్రిల్ మాసంలో ముందస్తుగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసుకునేందుకు అమలు చేయనున్న ఎర్లీ బల్డ్ స్కీమ్ ద్వారా నిధులు సమకూరే అవకాశముండటంతో ఏప్రిల్ మాసం జీతాలను కూడా జీహెచ్ఎంసీ నుంచే చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ఏప్రిల్ మాసం నుంచే మూడు కార్పొరేషన్లలో కొత్త ఆర్థిక కష్టాలు మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
గత సంవత్సరం నవంబర్ 25వ తేదీ వరకు సుమారు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 150 వార్డులతో కొనసాగుతున్న జీహెచ్ఎంసీకి 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, ఆ తర్వాత మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియపై శ్రద్ధ చూపిన సర్కారు జీహెచ్ఎంసీకి.. ఆ తర్వాత ఏర్పడిన రెండు కొత్త కార్పొరేషన్లకు నిధులు కేటాయించటంపై చూపలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పేరుకే మూడు కార్పొరేషన్లుగా కొనసాగుతున్నా, ఆర్థిక లావాదేవీలన్ని జీహెచ్ఎంసీ నుంచే కొనసాగుతున్నాయి. రెండు కొత్త కార్పొరేషన్లకు ఏప్రిల్ మాసంలో కొత్త బ్యాంక్ ఖాతాలను తెరిచి, ఆదాయం, అప్పుుల పంపకాలు జరిపిన తర్వాత మూడు కార్పొరేషన్లు తీవ్ర స్థాయిలో ఆర్థిక కష్టాలను ఎదుర్కొనున్నట్లు కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సర్కారుకు జీహెచ్ఎంసీ గడిచిన నాలుగేళ్లుగా పంపిన ప్రతిపాదనలు, సర్కారు బడ్జెట్ లో జరిపిన నిధుల కేటాయింపులు, విడుదల చేసిన నిధుల వివరాలిలా ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.3072.11 కోట్ల విలువైన ప్రతిపాదనలు సర్కారుకు జీహెచ్ఎంసీ పంపగా సర్కారు కేవలం రూ. 346.55 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరం (2024-25)లో కూడా సర్కారు జీహెచ్ఎంసీ పంపిన ప్రతిపాదనలను పక్కనబెట్టిన సర్కారు కేవలం రూ. 2,654 కోట్లను హెచ్ సిటీ పనులకు కేటాయించింది. కానీ ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు రూ.948.31 కోట్ల మాత్రమే విడుదల చేసింది. ఆ మరుసటి ఆర్థిక సంవత్సరం (2025-26)లో కూడా జీహెచ్ఎంసీ అవసరాలకు తగిన విధంగా ప్రతిపాదనలను సర్కారుకు పంపగా,అదే హెచ్ సిటీ ప్రాజెక్టు ప్రతిపాదనల కోసం రూ. 2,654 కోట్లను కేటాయిచిన సర్కారు.. ఏడాది చివరి వరకు కేవలం రూ. 584.38 కోట్లు విడుదల చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27) కు సంబంధించి కూడా జీహెచ్ఎంసీ సర్కారుకు రూ. 9,700 కోట్ల విలువైన ప్రతిపాదనలను సమర్పించినా, సర్కారు కేవలం హెచ్ సిటీ పనులకు రూ. 2,654 కోట్లను మాత్రమే కేటాయించింది. క్యూర్ పరిధికి ఈ బడ్జెట్ లో సర్కారు మొత్తం రూ. 7639.96 కోట్లను కేటాయించగా వీటిలో వివిధ విభాగాలకు లోన్లుగా రూ.3,505 కేటాయించగా, వివిధ విభాగాలకు నేరుగా రూ.4134.96 కోట్లను సర్కారు కేటాయించింది.
తాజాగా క్యూర్ కు జరిపిన కేటాయింపులు
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ట్రాఫిక్ సమస్య నివారణకు చేపట్టనున్న హెచ్ సిటీ పనులకు రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27)లో సర్కారు రూ. 2654 కోట్లను కేటాయించింది. దీంతో పాటు జలమండలికి ఫ్రీ వాటర్ సప్లై కోసం రూ. 300 కోట్లు, మెట్రో రైలు ఫేజ్-2కు రూ.600 కోట్లు, జలమండలి సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు కు రూ. వెయ్యి కోట్లు, రూ.1450 కోట్లను జలమండలికి రుణంగా, మరో రూ.555 కోట్లను కూడా రుణంగా, హైదరాబాద్ మెట్రో రైలు కు రూ. 500 కోట్లు, హెచ్ఎండీఏకు రుణంగా రూ. 500 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కు రుణంగా రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఈ సారి కూడా సర్కారు రూ.1500 కోట్లు కేటాయించింది.
Also Read: TG Budget 2026: రాష్ట్రంలో కీరోల్ పోషించే రంగాల్లో బడ్జెట్ కేటాయింపులు.. తగ్గినవి పెరిగినవి ఇవే..?
ఔటర్ రింగ్ రోడ్డు లోపల సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలు, నాలాలను కాపాడేందుకు సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రాకు మూడు హెడ్ ల కింద ఈసారి సర్కారు బడ్జెట్ లో భారీగా నిధులను కేటాయించింది. వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26)లో కేవలం రూ. 20 కోట్లను కేటాయించిన సర్కారు.. రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో ఏకంగా రూ.234.26 కోట్లు కేటాయించింది. వర్తమాన సంవత్సరం కన్నా బడ్జెట్ లో సర్కారు భారీగా నిధులు కేటాయించిందంటే మున్ముందు హైడ్రా కార్యకలాపాలను మరింత వేగవంతం చేయటానికేనన్న వాదనలున్నాయి.
Also Read: Hansika Motwari : యెల్లో డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో హన్సిక.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..