Hyderabad Musi River: హైదరాబాద్ నగరానికి జీవనాడిగా నిలిచే మూసి నది ప్రస్తుతం మహోగ్రరూపం దాల్చింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. మూసి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా మూసి తీరప్రాంత ప్రజలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
చాదర్ ఘాట్, శంకర్ నగర్ ప్రజల తరలింపు
మూసి పరివాహక ప్రాంతాల్లో నీరు చేరుతున్నదన్న సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ, జీఏచ్ఎంసీ, పోలీసు శాఖలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా చాదర్ ఘాట్, శంకర్ నగర్ ప్రాంతాల్లో పరిస్థితి వేగంగా మారుతుండడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాల్స్‌ను పునరావాస కేంద్రాలుగా మార్చి బాధితులకు ఆహారం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు అందిస్తున్నారు.
పురానాపూల్ పరిసరాల్లో నీటిముంపు
పురానాపూల్ ప్రాంతంలో మూసి నీరు రోడ్లపైకి చేరింది. వాహన రాకపోకలు అంతరాయం కలుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.
జియగూడా రూట్ బంద్
జియగూడా ప్రాంతంలో మూసి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అక్కడ రోడ్లపైకి నీరు రావడంతో పోలీసులు రూట్ బంద్ చేశారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులను అడ్డుకున్నారు. రోడ్లపైకి వస్తున్న వరద నీరు ప్రమాదకరమని హెచ్చరించిన పోలీసులు, అవసరం లేకపోతే బయటకు రాకూడదని స్థానికులకు సూచిస్తున్నారు.
అధికారులు అప్రమత్తం
మూసి పరివాహక ప్రాంతాలన్నింటిలోనూ పోలీసులు, జీఏచ్ఎంసీ సిబ్బంది పర్యటిస్తూ పరిస్థితిని గమనిస్తున్నారు. ఎక్కడైనా నీరు ఇళ్లలోకి చేరితే వెంటనే ప్రజలను బయటకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య బృందాలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, రోగుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ప్రజలకు హెచ్చరికలు
అధికారులు వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు పలు సూచనలు చేశారు. నది పరివాహక ప్రాంతాల్లో ఎవ్వరూ ఉండవద్దని, మూసి తీరప్రాంతాలకు వెళ్లి సెల్ఫీలు తీయడం, ఆటపాటలతో సమయం గడపడం ప్రమాదకరమని హెచ్చరించారు.
Also Read: ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు
ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం కొనసాగితే మూసి.. మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.