Hyderabad Rains: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. నగర పరిసరాల్లోని జంట జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. ముఖ్యంగా హిమాయత్ సాగర్ జలాశయం వరదనీటితో పొంగిపొర్లుతోంది. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుండి నీరు అధికంగా వచ్చి చేరడంతో జలాశయం పూర్తి స్థాయికి చేరింది. ఫలితంగా అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
నీటి విడుదలతో హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతుండడంతో.. నార్సింగ్-హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఫలితంగా మంచిరేవుల నుండి నార్సింగి వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచించారు.
ఈ రోడ్డు మూసివేత కారణంగా ప్రతిరోజూ ఈ మార్గాన్ని ఉపయోగించే వందలాది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల రాకపోకల్లో అంతరాయం కలుగుతోంది. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను గచ్చిబౌలి, ఇతర సమీప మార్గాల ద్వారా ప్రయాణించమని సూచిస్తున్నారు.
జలాశయం నీటి మట్టం పెరుగుతున్నందున అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గేట్లను ఎత్తే సమయంలో ఎంత నీరు విడుదల చేస్తున్నామన్న వివరాలను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇచ్చారు. మూసి పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేని సందర్భాల్లో నది తీర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.
హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో ముసి నది ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంది. ఇప్పటికే చాదర్ ఘాట్, పురానాపూల్, జియగూడా వంటి ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసు శాఖ బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు మూసి పరిసర ప్రాంతాలకు చేరకుండా నిరోధిస్తోంది. వరద నీటిలో ఉండే ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇస్తోంది.
అవసరమైతే పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. జీఏచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు సిద్ధం చేసి భోజనం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: మహోగ్రరూపం దాల్చిన మూసి
ప్రస్తుతం హిమాయత్ సాగర్ నిండుకుండగా మారి.. గేట్లు ఎత్తిన పరిస్థితి హైదరాబాద్ ప్రజల్లో ఆందోళన రేపుతోంది. మూసి నది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.