BC Reservations: తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర జనాభాలో బీసీల వాటాకు అనుగుణంగా వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ నెం.09ను రిలీజ్ చేసింది..
స్థానిక సంస్థల ఎన్నికలకు రేవంత్ సర్కార్ సిద్ధం
తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనున్నారు. CS, DGP, జిల్లా కలెక్టర్లు, ఎస్పిలతో ఈసీ చర్చించనున్నారు. దీంతో రేపు సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఉత్తర్వులలోని కీలక అంశాలు
రాష్ట్రంలో బీసీల జనాభా 56.33%గా ఉందని, అయితే స్థానిక సంస్థలలో వారి రాజకీయ ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని శ్రీ బూసాని వెంకటేశ్వర రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ తన నివేదికలో పేర్కొంది. క్షేత్రస్థాయి ఆధారాలు, సామాజిక, రాజకీయ సూచికలను పరిశీలించిన కమిషన్, బీసీలకు కనీసం 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిషన్ సిఫార్సులను, బీసీ జనాభా రాజకీయ ప్రాతినిధ్య అవసరాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, “తెలంగాణ వెనుకబడిన తరగతుల (గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్లు) బిల్లు, 2025″ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లును రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదించాయి.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% కోటా అమలు..
రాజ్యాంగబద్ధమైన అధికారాలు, న్యాయపరమైన గుర్తింపునకు అనుగుణంగా.. తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలలో సీట్లు, పదవుల విషయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రిజర్వేషన్ల అమలుకు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులతో రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% కోటా అధికారికంగా అమలు కానుంది.