ED raids Hyderabad: హైదరాబాద్ నగరంలో లగ్జరీ కార్ల డీలర్‌గా పేరుగాంచిన.. బసరత్ ఖాన్ ఇల్లు, ఆఫీస్‌పై (ED) అధికారులు శుక్రవారం ఉదయం సడన్‌గా దాడులు చేపట్టారు. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) ఉల్లంఘనల కేసులో ఈ సోదాలు జరిగాయి. బసరత్ ఖాన్ ఇప్పటికే పలు ఆర్థిక మోసాలు, కస్టమ్స్ ఉల్లంఘన కేసుల్లో పేరు రావడం, అంతకుముందు DRI (డైరెక్టరేట్ ఆఫ్ రేవెన్యూ ఇంటెలిజెన్స్) అరెస్టు చేసిన విషయాలు.. మళ్లీ వెలుగులోకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
లగ్జరీ కార్ల డీలర్‌గా బసరత్ ఖాన్ పేరు
బసరత్ ఖాన్ హైదరాబాద్‌లో లగ్జరీ ఇంపోర్టెడ్ కార్ల విక్రయాల్లో ప్రసిద్ధి పొందాడు. ఆయన దగ్గర రాజకీయ నాయకులు, సినీ తారలు, ప్రముఖ వ్యాపారవేత్తలు కార్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ల్యాంబోర్గినీ, రోల్స్‌రాయిస్, పోర్షే, బెంట్లీ, రేంజ్ రోవర్ వంటి అత్యంత ఖరీదైన వాహనాలను.. ఆయన తన కస్టమర్లకు సరఫరా చేసేవాడు. ఈ లావాదేవీల్లో పన్ను ఎగ్గొట్టడం, తప్పుడు డాక్యుమెంట్లతో వాహనాలను దిగుమతి చేయడం వంటి అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మాారింది.
విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసిన లగ్జరీ కార్లు
ఇడీ సిబ్బంది ప్రాథమిక విచారణలో బసరత్ ఖాన్ విదేశాల నుంచి.. కార్లను తక్కువ ధర చూపిస్తూ దిగుమతి చేసుకున్నాడని, కస్టమ్స్ పన్నులు చెల్లించకుండా దేశంలోకి తెచ్చాడని ఆరోపిస్తున్నారు. తర్వాత ఆ కార్లను అనేక కోట్ల ధరలకు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు విక్రయించినట్లు తేలింది. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇల్లు, కార్యాలయం తో పాటు స్నేహితుల ఇళ్లలో సోదాలు
శుక్రవారం తెల్లవారుజామునే ఈడీ బృందాలు హైదరాబాద్‌లోని బసరత్ ఖాన్ నివాసం, ఆయన కార్యాలయం, అలాగే ఆయన స్నేహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో ఒకేరోజు దాడులు జరిగాయి. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
వందల కోట్ల కస్టమ్స్ మోసంలో ఇంతకుముందు అరెస్ట్
కొన్ని సంవత్సరాల క్రితం డైరెక్టరేట్ ఆఫ్ రేవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI).. ఆయనను అనేక కోట్ల కస్టమ్స్ మోసంలో అరెస్టు చేసింది. అప్పట్లో ఆయన కస్టమ్స్ చెల్లించకుండా వందల కోట్ల విలువైన కార్లను దేశంలోకి తెచ్చినట్లు ఆరోపణలు నిరూపించబడ్డాయి. ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చిన ఆయన, తిరిగి లగ్జరీ కార్ల వ్యాపారం కొనసాగించాడని సమాచారం.
ఈడీ దర్యాప్తు దిశ
ప్రస్తుతం ఈడీ అధికారులు బసరత్ ఖాన్ గత 10 ఏళ్ల లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఆయన ఎవరికెవరికీ కార్లు అమ్మాడో, ఆ కార్ల కొనుగోలు కోసం ఉపయోగించిన డబ్బు మూలం ఏమిటో ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులు, ప్రభావవంతులైన వ్యాపారవేత్తల పేర్లు కూడా ఈ లావాదేవీల్లో ఉన్నాయన్న అనుమానం ఉంది. విదేశాల నుంచి హవాలా మార్గంలో డబ్బులు తెచ్చారా.. అనే కోణంలోనూ అధికారులు విచారణ చేస్తున్నారు.
Also Read: మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి అస్వస్థత
ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో లగ్జరీ కార్ల మార్కెట్ విస్తరించడం, అనేకమంది డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ దిగుమతులు జరపడం వల్ల కేంద్ర సంస్థలు అలర్ట్ అయ్యాయి. బసరత్ ఖాన్ కేసుతో పాటు మరికొన్ని డీలర్లపై కూడా త్వరలో దర్యాప్తు జరగనుందని సమాచారం.