KTR: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం అనాలోచిత, అహంకార, నియంతృత్వ పోకడ నిర్ణయంతో తెలంగాణ ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం పడిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకడల కారణంగానే ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో నుంచి అర్ధాంతరంగా వైదొలగిందని ఫైరయ్యారు. ప్రభుత్వం తీసుకున్న ఈ బాధ్యతారాహిత్య, అనాలోచిత నిర్ణయంతో రాష్ట్ర ప్రజలపై ఒక్కరోజే ఏకంగా ₹15 వేల కోట్ల అప్పుల భారం పడిందని విమర్శించారు.
మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ ను బద్నాం చేసే అవకాశం ఇవ్వకుండా, తామే మరమ్మతులు చేస్తామని ఎల్అండ్ టీ ముందుకురావడమే రేవంత్ రెడ్డికి కక్షగా మారిందని అన్నారు. అప్పటి నుంచే ఆ సంస్థపై కక్షగట్టి వేధించి, రాష్ట్రం విడిచి వెళ్ళిపోయేలా చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టును ఎలా ఆదుకొని నిలబెట్టిందో కేటీఆర్ వివరించారు. ‘2014లో మేము అధికారంలోకి వచ్చే నాటికి మెట్రో పనులు కేవలం 20 నుంచి 25% మాత్రమే పూర్తయ్యాయి. రాష్ట్ర విభజనతో రైడర్‌షిప్ తగ్గుతుందని ఎల్అడ్ టీ సంస్థ ఆందోళన చెందితే, స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు. ప్రజా రవాణా ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా, హైదరాబాద్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చి పనులను పరుగులు పెట్టించారు. కేవలం మూడేండ్లలోనే 2017 నవంబర్ 29న ప్రధాని మోదీ చేతుల మీదుగా మొదటి దశను ప్రారంభించాం’ అని అన్నారు.
కరోనా కష్టకాలంలోనూ సంస్థ నష్టాల్లో ఉందని భయపడితే, కేసీఆర్ గారు మరోసారి అండగా నిలిచారు. రూ.3,000 కోట్ల వడ్డీలేని రుణం (సాఫ్ట్ లోన్) మంజూరు చేసి, అందులో ₹900 కోట్లు విడుదల చేసి మెట్రోను కాపాడారు. మా ప్రభుత్వ హయాంలో రోజుకు 5 లక్షల మంది ప్రయాణించే స్థాయికి, పీక్ అవర్స్‌లో కోచ్‌లు సరిపోనంతగా మెట్రోను అభివృద్ధి చేశాం. 69 కిలోమీటర్ల లైన్ పూర్తిచేసి, దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాం. కాంగ్రెస్ హయాంలో ఆవాస హోటల్ వరకే ఉన్న లైన్‌ను, లక్షలాది ఐటీ ఉద్యోగులు పనిచేసే మైండ్ స్పేస్ వరకు పొడిగించి, స్కైవాక్‌లు నిర్మించి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాం’ అని కేటీఆర్ తెలిపారు.
ALSO READ: Weather News: మరో రెండు రోజుల భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, బయటకు వెళ్తే అంతే సంగతులు
‘తెల్లారిలేస్తే ఖజానా ఖాళీ, అప్పు పుట్టడం లేదని సీఎం మొత్తుకుంటారు. ఐటీడీఏ ఉద్యోగులకు ఏడు నెలలుగా జీతాల్లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే దిక్కులేదు. ఆరు గ్యారెంటీల అమలుకు పైసల్లేవు. ఇలాంటి పరిస్థితుల్లో, ప్రైవేటు సంస్థ మోస్తున్న భారాన్ని ప్రభుత్వం నెత్తికెత్తుకొని రూ.15 వేల కోట్ల అప్పు చేయడం దేనికి? మీ అహంకారపూరిత నిర్ణయాలతో ప్రజలపై ఈ భారాన్ని ఎందుకు మోపారు?” అని కేటీఆర్ నిలదీశారు. కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్రం ఇప్పటికే ₹2.20 లక్షల కోట్ల అప్పు చేసిందని, దానికి ఈ ₹15 వేల కోట్లు అదనమని అన్నారు.
‘ఈ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఎల్&టీకి కేటాయించిన 280 ఎకరాల విలువైన భూములపై సీఎం రేవంత్ రెడ్డికి, ఆయన సన్నిహితుల కన్ను పడింది. ఆ భూములను అడ్డగోలుగా అమ్మకోవడానికి లేదా తమ అనుచరులకు చెందిన సంస్థలకు కట్టబెట్టడానికే ఈ స్కెచ్ వేశారు. ఇప్పటికే ఉన్న మాల్స్‌ను ఎవరెవరికి రాసిస్తారో త్వరలోనే చూస్తారు. ఇది హైదరాబాద్ ప్రజల మీద వేసిన పెద్ద భారం. ఈ నిర్ణయంతో ఎల్&టీ షేర్ విలువ 3% పెరిగింది. మరి రాష్ట్ర ప్రజలకు ఒరిగిన లాభమేంటి? ఏ ముడుపులు, ఏ కమిషన్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారో సీఎం చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.