BRS KTR: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లగ్జరీ కార్ల కేసులో అరెస్ట్ చేయాలనకుంటే చేసుకోండని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని అన్నారు. అసలు ఏ తప్పు చేయలేదని చెప్పారు. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకు రెడీగా ఉన్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘నా అరెస్ట్ పై కాంగ్రెస్ నేతలు కలలు అంటున్నారు. కొందరు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసుకోండి. నాకు అరెస్ట్ భయం లేదు. నా అరెస్ట్ తో రేవంత్ రెడ్డికి పైశాచిక ఆనందం తప్ప మరొకటి రాదు. నేను ఏ తప్పు చేయలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. నాతో రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలి’ కేటీఆర్ పేర్కొన్నారు.
‘నాపై ఏసీబీ కేసు ఉంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు ఉంది. ఆర్ఎస్(రేవంత్, సంజయ్) బ్రదర్స్ కు ప్రజా సమస్యలు పట్టవు. ఆర్ఎస్ బ్రదర్స్ కు నేను ఏ కారులో తిరుగుతున్నానో మాత్రమే కావాలి. కారుల విషయంలో నేను తప్పు చేస్తే కేంద్రం చర్యలు తీసుకోవచ్చు. జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్ కు ఉంది. హైదరాబాద్ లో మొన్న గెలిచాం.. నిన్న గెలిచాం.. రేపూ గెలుస్తాం. హైడ్రా పెద్ద వాళ్లకు చుట్టం.. పేదలకు భూతం. వివేక్, కేవీపీ రామచంద్రరావు, తిరుపతి రెడ్డిల ఇళ్ళను హైడ్రా ఎందుకు కూల్చదు’ అని కేటీఆర్ నిలదీశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక ఒక స్కీమ్, ఒక స్కామ్ ఉంటుందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తీసుకునే నిర్ణయాల్లో పారదర్శకత లేదని అన్నారు.. ప్రజల పక్షాన వృద్ధులకు ₹4000 పెన్షన్, ఆడబిడ్డలకు ₹2500, విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తావని అడుగుతూనే ఉంటామని అన్నారు. మరో కార్పొరేట్ సంస్థను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో నాలుగైదు రోజుల్లో ఆధారాలతో సహా బయటపెడతా అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ‘హైడ్రా’ అనే భూతంతో రియల్ ఎస్టేట్‌ను దెబ్బతీశారన్న కేటీఆర్, పెద్దల ఇండ్ల జోలికి వెళ్లని హైడ్రా పేదల ఇండ్లపై మాత్రం తన ప్రతాపం చూపిస్తుందని విమర్శించారు. ఇవాళ బ్లాక్ మేయిల్, బ్లాక్ మేయిలర్స్ కు హైడ్రానే కేంద్రంగా ఉందని ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్‌కే పట్టం కడతారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ గెలుపు తమదేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.