Ganja Smuggling: స్వేచ్ఛ బ్యూరో: అంతర్ రాష్ట్ర గంజాయి గ్యాంగును సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 29.810 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
శాంతిభద్రతల పరిస్థితికి ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు అమలు చేస్తున్న చర్యల్లో భాగంగా పోలీసులు అన్ని లాడ్జిల్లో తనిఖీలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుల్తాన్ బజార్ పోలీసులు శుక్రవారం రంగ్ మహల్ వద్ద ఉన్న జేకే లాడ్జిలో సోదాలు చేశారు. 103 నెంబర్ గదిలో తనిఖీలు చేయగా భారీ మొత్తంలో గంజాయి దొరికింది. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన దుకేశ్ శ్యామ్ పట్నాయక్ (41), దీపక్ (22)లతోపాటు లాడ్జి మేనేజర్ సయ్యద్ మునీర్ (57)లను అరెస్ట్ చేశారు.
ప్రాథమిక విచారణలో శ్యామ్ పట్నాయక్, దీపక్ లు ఈ గంజాయిని ఒడిశాలో కొని సూరత్ తీసుకెళ్లేందుకు పథకం వేసినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వచ్చినట్టుగా తేలింది. ఈ ఇద్దరి వద్ద గంజాయి ఉందన్న విషయం తెలిసి కూడా లాడ్జి మేనేజర్ సయ్యద్ మునీర్ డబ్బు తీసుకుని రూం ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ కేసులో మలయా కన్హర్ అలియాస్ బిట్టూ, బప్పీ కన్హర్ లకు కూడా సంబంధం ఉన్నట్టుగా వెల్లడైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భారీగా గంజాయిని సీజ్ చేసి నిందితులను పట్టుకున్న సీఐ నరేశ్, డీఐ ధర్మారావు, ఎస్ఐ సాయిరాం, హెడ్ కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుల్ లింగంను డీసీపీ అభినందించారు.
Also Read: జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసుల్లో వరుస అగ్ని ప్రమాదాలు.. ప్రమాదమా? కుట్రా?