Home Buying Tips: సొంత ఇల్లు కొనడం అనేది ప్రతి మధ్యతరగతి మనిషి జీవితంలో ఒక పెద్ద డ్రీమ్. అందుకోసం నెలల తరబడి ఆన్లైన్ ప్రాపర్టీ వెబ్సైట్లు జల్లెడ పడుతుంటారు. ఏ ఏరియాలో రేట్లు తక్కువగా ఉన్నాయా? ఏ బిల్డర్ క్వాలిటీ బాగుంది? దగ్గర్లో స్కూల్స్, హాస్పిటల్స్, మెట్రో ఉన్నాయా? హోమ్ లోన్ తీసుకుంటే నెలకు ఎంత ఈఎంఐ (EMI) కట్టాలి? ఇలా ప్రతి పైసా లెక్కలు వేసుకుంటారు. అయితే ఇల్లు కొనే హడావుడిలో చాలామంది ఒక అతి ముఖ్యమైన విషయాన్ని అస్సలు పట్టించుకోరు.. అదే ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత నెలనెలా అయ్యే హిడెన్ ఖర్చులు, కరెంట్ బిల్లులు, నీళ్ల ట్యాంకర్ల గోల, అపార్ట్మెంట్ సొసైటీ మెయింటెనెన్స్ ఛార్జీలు.. ఇవన్నీ కలిపితే నెలవారీ బడ్జెట్ ఒక్కసారిగా తలకిందులయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆన్లైన్లో ఇల్లు వెతికేటప్పుడు రేటు, లొకేషన్ చూసి ఆగిపోకుండా ఈ 5 విషయాలను కూడా తప్పకుండా చెక్ చేయాలని రియల్ ఎస్టేట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ మధ్య రియల్ ఎస్టేట్ ప్రకటనల్లో ‘గ్రీన్ హోమ్’, ‘ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్’ అనే మాటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే బిల్డర్ అలా చెప్పినంత మాత్రాన ఆ ప్రాజెక్ట్ పర్యావరణానికి అనుకూలమైనదని నమ్మకూడదు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) వంటి గుర్తింపు పొందిన సంస్థల నుంచి సర్టిఫికేషన్ ఉందా లేదా తెలుసుకోవాలి. ఈ ధృవీకరణలో నీటి వినియోగం, విద్యుత్ ఆదా, గాలి ప్రసరణ, నిర్మాణ సామగ్రి, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను పరిశీలిస్తారు. కాబట్టి ప్రాజెక్ట్‌కు సంబంధించిన సర్టిఫికెట్‌ను బిల్డర్‌ను అడిగి చూడండి. కేవలం బ్రోచర్లో గ్రీన్ ఫీచర్లు ఉన్నాయని చెప్పడం సరిపోదు.
ఇల్లు కొనేటప్పుడు రూమ్స్, బాల్కనీ, పార్కింగ్ మాత్రమే కాదు.. ఇంట్లోకి వెలుతురు, గాలి ఎంత వస్తాయో కూడా చూడాలి. సరైన దిశలో కిటికీలు ఉండటం, గాలి ఒక వైపు నుంచి మరోవైపు వెళ్లేలా నిర్మాణం ఉండటం వల్ల పగటిపూట లైట్లు, ఫ్యాన్ల అవసరం తగ్గవచ్చు. అలాగే గోడలకు ఇన్సులేషన్, ఎల్ఈడీ లైట్లు, విద్యుత్ ఆదా చేసే పరికరాలు ఉన్నాయా అని తెలుసుకోండి. వేసవిలో ఇల్లు ఎంత వేడెక్కుతుంది? ఏసీ ఎక్కువసేపు వాడాల్సి వస్తుందా? వంటి విషయాలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే చిన్న చిన్న అంశాలే దీర్ఘకాలంలో మీ విద్యుత్ బిల్లులో పెద్ద తేడా తీసుకురావచ్చు.
చాలా ప్రాజెక్టులు సోలార్ ప్యానెల్స్, వర్షపు నీటి సేకరణ, మురుగు నీటిని శుద్ధి చేసి తిరిగి వాడే సదుపాయాలు ఉన్నాయని ప్రచారం చేస్తుంటాయి. అయితే అవి ప్రతి ఫ్లాట్‌కు ఉపయోగపడతాయా? లేక లిఫ్టులు, కారిడార్లు, ఇతర ప్రాంతాల విద్యుత్ అవసరాలకే పరిమితమా? అన్నది తెలుసుకోవాలి. అలాగే వర్షపు నీటిని నిల్వ చేసే వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా? శుద్ధి చేసిన నీటిని ఎక్కడ ఉపయోగిస్తున్నారు? ఈ సౌకర్యాలను ఎవరు నిర్వహిస్తున్నారు? వంటి ప్రశ్నలు అడగాలి. ప్రకటనల్లో కనిపించే ఫీచర్లకంటే అవి వాస్తవంగా ఎంతవరకు ఉపయోగపడుతున్నాయనేదే ముఖ్యం.
ఒకే ధరకు రెండు ఫ్లాట్లు దొరికినా, వాటిలో నివసించడానికి అయ్యే ఖర్చులు మాత్రం వేర్వేరుగా ఉండవచ్చు. సొసైటీ నిర్వహణ ఛార్జీలు, నీటి బిల్లులు, విద్యుత్ ఖర్చులు, లిఫ్ట్ నిర్వహణ, ఇతర మరమ్మతులు.. ఇలా ప్రతి నెలా అదనపు ఖర్చులు ఉంటాయి. ఇప్పటికే నివాసం ఉంటున్న ప్రాజెక్ట్‌లో ఇల్లు కొనాలనుకుంటే అక్కడి వారితో మాట్లాడండి. నెలకు ఎంత మెయింటెనెన్స్ కడుతున్నారు? నీటి సరఫరా సక్రమంగా ఉందా? విద్యుత్ బిల్లులు ఎంత వస్తున్నాయి? బిల్డర్ చెప్పిన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా? అని అడిగి తెలుసుకోండి. ఇలా చేస్తే కొనుగోలు సమయంలో కనిపించని ఖర్చుల గురించి ముందే అవగాహన వస్తుంది.
ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్టులలో ఫ్లాట్ కొనేటప్పుడు బిల్డర్లు చెప్పే ప్రతి మాటను గుడ్డిగా నమ్మకుండా, ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆన్లైన్లో కనిపించే రంగురంగుల 3డీ ఫొటోలు, యాడ్స్ చూసి వెంటనే అడ్వాన్స్ కట్టేయకండి. ఆ ప్రాజెక్ట్‌కు రెరా (RERA) రిజిస్ట్రేషన్, ప్రభుత్వ అనుమతులు పక్కాగా ఉన్నాయో లేదో డాక్యుమెంట్లను పరిశీలించండి. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ (వర్షపు నీటి సంరక్షణ) వంటి సౌకర్యాలు ఇప్పటికే ఏర్పాటు చేశారా? లేక హ్యాండోవర్ సమయానికి చేస్తామని చెబుతున్నారా? అనేది స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా, హోమ్ లోన్ తీసుకునే ముందే కేవలం బ్యాంక్ ఈఎంఐ (EMI) మాత్రమే కాకుండా, ఇంట్లోకి మారిన తర్వాత ప్రతి నెలా వచ్చే మెయింటెనెన్స్, కరెంట్ మరియు నీటి ఖర్చులను కూడా మీ నెలవారీ బడ్జెట్లో ముందే లెక్కేసుకోవడం చాలా సేఫ్.
చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి: ఇల్లు కొనేటప్పుడు దాని ధర ఎంత అనే దానితో పాటు, అందులో నివసించడానికి ఎంత ఖర్చవుతుందనేది కూడా ముఖ్యం. ఆన్లైన్లో కనిపించే ప్రకటనలను మాత్రమే నమ్మకుండా, పత్రాలు పరిశీలించి, సాధ్యమైతే అక్కడ నివసిస్తున్నవారితో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. అప్పుడే భవిష్యత్తులో అనవసర ఖర్చులు, ఇబ్బందులు తగ్గించుకోవచ్చు.
Read Also: పెళ్లి తర్వాత భార్యాభర్తలు జాయింట్ అకౌంట్ తెరవాలా? వేర్వేరు ఖాతాలు ఉంచుకోవాలా?