TG Number Plates: తెలంగాణ ప్రభుత్వం గతంలో ‘TS’ గా ఉన్న నెంబర్ ప్లేట్లను కొత్తగా ‘TG’ గా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికనుగుణంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. సిటీ పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన అన్ని వాహనాలపై ఉన్న తెలంగాణ స్టేట్ పోలీస్ స్టిక్కర్లను తొలగించి, కొత్తగా ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లను అమర్చాలని ఆదేశించారు. అన్ని పెట్రోల్ వాహనాలు, పోలీస్ స్టేషన్ వాహనాలను కొత్త రూపంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
దీంతో సి.ఎ.ఆర్. హెడ్‌క్వార్టర్స్ అధికారులు మొత్తం 188 ప్రభుత్వ వాహనాలపై పాత ‘TS’ స్టిక్కర్లను తొలగించి, వాటి స్థానంలో కొత్త ‘TG’ స్టిక్కర్లను అమర్చే ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసుల వద్ద ఉన్న అన్ని వాహనాలకు సుమారు రూ.1.6 కోట్ల వ్యయంతో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఇందులో ప్రతి వాహనంపై స్టిక్కర్లను తొలగించడం, వాటి స్థానంలో తెలంగాణ పోలీస్ స్టిక్కర్లను అమర్చడం, మెషిన్ పాలిషింగ్, అవసరమైతే బంపర్లు, డోర్లు, ప్యానెళ్లపై డెంటింగ్, పెయింటింగ్ వంటి పనులు చేశారు. ఈ విధంగా వాహనాలను సరైన కండీషన్ లో ఉంచామని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలతో స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తయిన 134 పెట్రోలింగ్ వాహనాలను సి.ఎ.ఆర్. హెడ్‌క్వార్టర్స్ అధికారులు ఆదివారం పునఃప్రారంభించారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నిరోధం, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, పోలీసుల పటిష్ఠత కొనసాగించడంలో ఈ వాహనాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు.
Also Read: 10 నకిలీ గోల్డ్ లోన్ అకౌంట్స్.. రూ.75 లక్షలు.. బయటపడ్డ యూనియన్ బ్యాంకు మేనేజర్ బాగోతం
హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని ఇతర వాహనాలు, ట్రాఫిక్ ఏసీపీ, ఇన్స్పెక్టర్, పైలట్ వాహనాలు, అలాగే ఇంటర్‌సెప్టర్ వాహనాలకు కూడా రాబోయే కొన్ని రోజుల్లో స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. వాటిని కూడా పూర్తి కండీషన్ లో ఉండేటట్లు రిపేర్స్ చేయిస్తామన్నా రు. ఈ సందర్భంగా వాహనాల డ్రైవర్లకు వాటిని శుభ్రంగా, సక్రమంగా ఉంచే విధంగా స్పష్టమైన మార్గదర్శకాలు అందజేశారు.