Hyderabad Water Board: హైదరాబాద్ మహాననగరంలో అడుగంటుతున్న భూగర్భ జలాలను పెంచేందుకు నగరంలో ఇప్పటికే నిర్మించిన ఇంకుడు గుంతలను పునరుద్ధరణ చేసుకోవాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి సూచించారు. జలమండలి నిర్వహిస్తున్న ‘జల మండలి బస్తీబాట’ కార్యక్రమంలో భాగంగా బాగ్ లింగంపల్లి వార్డు, ముషీరాబాద్ సర్కిల్ డివిజన్-17 పరిధిలోని పద్మ కాలనీ ప్రాంతంలో జలమండలి ఎండీ అధికారులతో కలిసి పర్యటించారు. ఉదయం నీటి సరఫరా సమయంలో పలు నివాసాలలో నీటి సరఫరా వాకబు చేసిన ఎండీ నీటి నాణ్యత, సరఫరాలో సమయం పాలన తదితర వివరాలను స్థానికులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ప్రాంతంలో పలు నివాసాల్లో నీటి వృధాను గుర్తించారు. విలువైన తాగునీటిని తాగటానికి కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగిస్తే జరినామాలు విధించడంతో పాటు అవసరమైతే కనెక్షన్లు కూడా తొలగిస్తామని హెచ్చరించారు.
Also Read: NIC Recruitment 2026: రూ.లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఈ అర్హత ఉంటే ఎనఫ్, పూర్తి వివరాలివే
ఈ పర్యటనలో భాగంగా తాగునీటిని వృథా చేస్తున్న వినియోగదారులను గుర్తించి, ఎండీ ఆదేశాల మేరకు వారికి అధికారులు జరిమానాలు విధించడంతో పాటు, అవసరమైన చోట నీటి కనెక్షన్ కూడా తొలగించారు. అదే విధంగా బాగ్‌లింగంపల్లి వార్డు పరిధిలోని ఆదిత్య అపార్ట్‌మెంట్‌లో వర్షపు నీటి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను పునరుద్ధరించే పనులలో ఎండీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ జలమండలి అధికారులు ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారని, నీటిని వృథా చేయకుండా బాధ్యతగా, పొదుపుగా వినియోగించుకోవాలని నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ నగరానికి గోదావరి, కృష్ణ నదుల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరం నుంచి మంచినీటిని సేకరించి, శుద్ధి చేసి నగరవాసులకు జలమండలి సరఫరా చేస్తోందన్నారు. ఇందు కోసం జలమండలి ఎన్నో వ్యయప్రయాసలు పడుతోందని వివరించారు. కొంతమంది మాత్రం అవగాహనారాహిత్యంతో నీటిని వృథా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నీటి ఇబ్బందులు వస్తాయనే అవగాహన కూడా చాలామందిలో లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు నీటిని పరిరక్షించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వచ్చే ప్రమాదముందని తెలిపారు. అమూల్యమైన నీటిని గృహావసరాలకు వినియోగించుకున్న తర్వాత ఉన్న సాంకేతికతతో శుద్ధి చేసి, ఆ నీటినే నిర్మాణ, గార్డెనింగ్ వంటి ఇతర అవసరాలకు కూడా ఉపయోగించడానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి సీజీఎం ప్రభు, జీఎం శ్రీధర్ రెడ్డి, డీజీఎం ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Blower Electric Chulha: వావ్, గ్యాస్ స్టవ్‌లా పనిచేసే ఎలక్ట్రిక్ స్టవ్.. ధర కూడా చాలా తక్కువ!