Salvo illigal Plots :
⦿ యాదాద్రి హిల్స్ పేరుతో ఆర్ఆర్ ఎనర్జిటిక్ భూముల్లో రియల్ భూం
⦿ 70 ఎకరాలకు అనుమతులు.. 200 ఎకరాల్లో అమ్మకాలు
⦿ సాల్వో జయరాం రెడ్డి భూ నాటకాలతో 900 మందికి దారి ప్రాబ్లమ్
⦿ ఇల్లీగల్ క్రషర్ అప్పగింతతో చల్లబడ్డ ప్రజా ప్రతినిధులు
⦿ బినామీ పేర్లతో భూ విక్రయాలు.. చెక్స్ పాస్ కాకుండానే టైటిల్
⦿ సీలింగ్ ల్యాండ్స్ సైతం తమవే అంటూ బిల్డప్స్
⦿ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా
⦿ ఐటీ అధికారుల ఆరా.. తప్పించుకు తిరుగుతున్న జయరాం రెడ్డి
⦿ రేపోమాపో సాల్వో, యాదాద్రి హిల్స్ భూ వివాదాలపై ధర్నాలు
⦿ అందినకాడికి ప్రభుత్వ భూములను దోచుకుంటున్న తీరుపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: యాదాద్రి జిల్లాలో భూ దందాలకు లెక్కేలేదు. పేపర్‌పై లే అవుట్స్ వేసి, గుట్టలను చూపించి సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేసిన దందాలు ఎన్నో. భూములు రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని, రోజూ రియల్ ఎస్టేట్ కంపెనీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు కస్టమర్స్. ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్ దండిగా ఉన్న ఈ జిల్లాలో ధరణి మాటున వేల ఎకరాలు క్లియర్ చేసుకున్నారు. అందులో స్పెక్ట్రా, సాల్వో ఎక్స్‌ప్లోజర్ అండ్ కెమికల్ కంపెనీల మదర్ సంస్థ అయిన ఆర్ఆర్ ఎనర్జిటిక్స్‌కి చెందిన 600 ఎకరాల భూమి అమ్మేశారు. మ్యాప్ విచ్చలవిడిగా మారుస్తూ, అసైన్డ్ భూములను మింగేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. దీనికి సంబంధించిన విషయాలను ఇప్పటికే ‘స్వేచ్ఛ’ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. బీఆర్ఎస్ నేతల బినామీల వ్యవహారాన్ని ఎండగట్టింది. కానీ, వాళ్ల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పెంపుడు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారు. ‘స్వేచ్ఛ’ ఈ – పేపర్ స్వేచ్ఛాయుతంగా వార్తలు ఇస్తుంది. తప్పు ఎవరు చేసినా నిలదీసే ధైర్యం ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీంకు ఉంది. జర్నలిజం విలువలను కాపాడేలా సాక్ష్యాధారాలు ఉంటేనే వార్తలు ప్రచురిస్తుంది. పేర్లు, ఫోటోలతో సహా ప్రచురించే ధైర్యం ఒక్క స్వేచ్ఛ టీంకే ఉందని గుర్తుంచుకోవాలి. నోటికొచ్చింది మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. నిజం గడపదాటక ముందే అబద్ధం అంతా చుట్టొచ్చినట్లు కనిపించినా, నిజం నిప్పులాంటిది. ఎప్పటికైనా అదే గెలుస్తుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యవహారాన్ని, పొంతనలేని మాటలను కడిగే రోజు దగ్గరలో ఉందని గుర్తు పెట్టుకోవాలి.
యాదాద్రి హిల్స్ పేరుతో దందాలెన్నో?
యాదాద్రి జిల్లా రాజపేట్ మండలం చల్లూరు గ్రామంలో ఆర్ఆర్ ఎనర్జిటిక్ కంపెనీ 1175 ఎకరాలను పోగు చేసింది. అసైన్డ్, సీలింగ్ భూములను సైతం తన ఖాతాలో వేసుకుంది. ఒక్క 322 సర్వే నెంబర్‌లోనే 1585 ఎకరాల భూమి ఉంది. గతంలో వెంకటయ్య హత్య తర్వాత తమిళనాడు కంపెనీ ఆర్‌ఆర్ ఎనర్జిటిక్స్ భూములపై వెనక్కి తగ్గింది. దీంతో ఆ భూములపై కన్నేసిన సాల్వో ఎక్స్‌ప్లోజర్స్ ఓనర్స్ చేజిక్కించుకున్నారు. ఇందులో డైరెక్టర్స్‌గా బీఆర్ఎస్ బినామీగా ఉండే వంగా రాజేశ్వర్ రెడ్డి చేరాడనే విమర్శలు ఉన్నాయి. ఇందులో నుంచి స్పెక్ట్రా కంపెనీకి 400 ఎకరాల భూమి అమ్మేశారు. అదిగో గుట్ట ఇదిగో ప్లాట్ అంటూ నెలల వారి కిస్తీలు వసూలు చేసి దండుకున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయకుండా కస్టమర్స్‌ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నాగోల్‌లోని ఆఫీస్‌కి రోజూ వందల మంది వచ్చి ధర్నాలు చేసి వెళ్తున్నారు. కానీ, సమస్య పరిష్కారం కావడం లేదు. ఇందులో 210 ఎకరాలు జయరాం రెడ్డి పార్ట్‌నర్స్‌గా ఉంటూ 79 ఎకరాలకు డీటీసీపీ, రెరా అనుమతులు అంటూ రోడ్డు లేకుండానే ప్రైవేట్ భూముల్లో నుంచి రోడ్డు చూపిస్తూ, అక్రమంగా అనుమతులు తెచ్చుకున్నారు. మిగితా 131 ఎకరాలకు ఎలాంటి అనుమతులు లేకుండానే డబ్బులు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వకపోవడంతో కస్టమర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీనిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీకర్ హోమ్స్, బినామీ పేర్లపై నారాయణ రావు అనే వ్యక్తి కుట్ర పూరితంగా భూములు కొనుగోలు చేశారు. చెక్స్ పాస్ కాకుండానే టైటిల్‌గా మారిపోయింది. అయితే, ఈ డ్యాకుమెంట్(నెంబర్ 4186/2019) చెల్లదంటూ కొట్లాడుకుంటున్నారు. పని చేసిన వర్కర్స్‌కి డబ్బులు ఇప్పటికీ ఇవ్వ లేదు. నారాయణ అనే డెవలపర్ చనిపోవడంతో భూమిని చదును చేసి, ప్లాట్‌గా మార్చిన వారికి కోటి 15 లక్షలు బాకీ ఉన్నారు. వీరంతా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇలా మధ్యవర్తులకు, సేల్స్‌మెన్స్‌కి కోట్లాది రూపాయలు బకాయి పడ్డారు. వీటన్నింటిలో జయరాం రెడ్డి పార్ట్‌నర్‌గా ఉండటంతో బాంబుల కంపెనీకి ముడి పెడుపెడుతూ కోట్లాది రూపాయల అక్రమ భూములపై ఫిర్యాదులు చేస్తున్నారు. భాగస్తుల మధ్య వివాదం ఉండటంతో ఆలేరు కోర్టులో (ఓఎస్ నెంబర్ 5/2020, 17/2020), భువనగిరి కోర్టులో (ఐఏ 137/2020) ఇంజక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి. 2019లోనే 44.38 గుంటల భూమికి డీ మార్కెషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇలా అనేక కోర్టు కేసుల నడుమ ప్లాట్ ఓనర్స్ ఇబ్బందులు పడుతున్నారు. వారికి రిజిస్ట్రేషన్ చేయడం లేదు. 44 ఎకరాలు బాంబుల తయారీ కంపెనీ అయినా సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్ అండ్ కెమికల్ కంపెనీ ఎలా రియల్ ఎస్టేట్ చేస్తుందని అక్రమ సంపదపై నిగ్గు తేల్చాలని ఐటీకి లేఖలు అందాయి. ఇప్పుడు ఐటీ అదికారులు లెక్కలు తేల్చే పనిలో పడ్డారు.
రోడ్డుకు అడ్డంగా గేట్
322 సర్వే నెంబర్‌కు దారి ప్రైవేట్ భూముల వద్ద నుంచి చూపించారు. డీటీసీపీని మేనేజ్ చేయడంతో వారంతా అనుమతులు ఇచ్చారు. కానీ, ముందు ఉన్న ప్రైవేట్ భూములను కొనుగోలు చేసి మిగితా వారికి దారి ఇవ్వ లేదు. తమకే ఉందని అంటున్నారు. మిగితా ప్రైవేట్ భూముల వారు తమ భూమిలో నుంచి వెళ్లవద్దని అడ్డు తగులుతున్నారు. దీంతో వివాదం ముదిరి జయరాం సంస్థ గేట్లను కూల్చివేశారు గ్రామస్తులు. ప్లాట్ ఓనర్స్‌ని సైతం వెళ్లకుండా లిటిగేషన్ సృష్టించింది సాల్వో కంపెనీ యాజమాన్యం.
ఆందోళన బాటలో బాధితులు
ఒకవైపు 300 మంది ప్లాట్ ఓనర్స్ డబ్బులు చెల్లించినా పార్ట్‌నర్స్ మధ్య వివాదం ఉందని రిజిస్ట్రేషన్ చేయలేదు. మరోవైపు 350 ఎకరాల ప్రభుత్వ భూముల్లో పాగా వేశారు. అప్పుడు అసైన్డ్ చేసిన గంగిరెద్దుల వారు, ప్లాట్ ఓనర్స్ సాల్వో కంపెనీకి వత్తసు పలుకున్న వారిపై ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. వందాలది మంది ధర్నాకు ప్లాన్ చేస్తున్నారు. స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం ఆధారాలతో కథనాలు ఇవ్వడంతో వారికి మరింత ధైర్యం పెరుగుతోంది. ఒక్క సాల్వో కంపెనీ స్వాధీనంలో ఉన్న సుమారు 800 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వానికి రూ.2,500 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుంది. గతంలో రెగ్యులరైజేషన్ కోసం అప్లికేషన్స్ పెట్టుకుంటే కాలేదు. గ్రామాలకు దగ్గరగా దొంగచాటున ప్రభుత్వ భూముల్లో క్రషర్ యూనిట్లు (కీసర సర్వే నెంబర్ 918) నడిపించేందుకు లీజుకు ఇచ్చారు. ఎకరాలకు ఎకరాలు అక్రమంగా మైనింగ్ పేరుతో కొల్లగొట్టారు. ఎలాంటి భూమి లేని నాగేశ్వర్‌రావు కంపెనీకి కరెంట్ మీటర్లు, అనుమతులు ఇచ్చారు. కోర్టు కేసుల నేపథ్యంలో ఆగిపోయిన క్రషర్, నాలుగు రోజుల క్రితం ఓ ప్రజాప్రతినిధి ఓపెన్ చేశారు. ఇలా అనేక అక్రమాల్లో యాదాద్రి భూ కబ్జాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఈ ప్రభుత్వ భూములను కాపాడి, అక్రమార్కుల ఇల్లీగల్ బిజినెస్‌కి అడ్డుకట్ట వేయాలని స్థానికులు వేడుకుంటున్నారు. దేశ భద్రతను కాపాడాల్సిన ఎక్స్‌ప్లోజర్స్ కంపెనీ విచ్చలవిడి తనంతో దేశ భద్రతకే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో పెసా యాక్ట్ ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా రెండు జిల్లాల సరిహద్దులను గుర్తించి, ఫేక్, పాబ్రికేట్ మ్యాప్‌లను రద్దు చేయించి కఠిన చర్లయు తీసుకోవాలి.