పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై అనర్హత వేటు వేస్తారని ముందు నుంచి ప్రచారం జరిగినా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రం క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆధారాలు లేవని తీర్పులో పేర్కొన్నారు. అయితే, 2023 సార్వత్రిక ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ గుర్తుమీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత అధికారం బదిలీ కావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.అనంతరం వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పలుమార్లు ప్రస్తావించింది.ఇంతకుమించిన ఆధారాలు స్పీకర్‌కు ఏం కావాలని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
స్పీకర్ నిర్ణయం తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు. స్పీకర్ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, ప్రజా తీర్పును అ గౌరవపరిచారని, ప్రజలంతా ప్రభుత్వం , స్పీకర్ తీరును గమనిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజ్యంగం,ప్రజాస్వామ్యానికి విలువ లేదని విమర్శలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం స్పందించారు. స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చిన తర్వాత మీడియాతో దానం మాట్లాడారు. తాను స్పీకర్ పరిధిలో ఎలాంటి తప్పు చేయలేదని దానం కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్నారని, ఈ విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ తనను వివరణ అడుగలేదని అన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సైతం తనను ప్రశ్నించలేదని, బీఆర్ఎస్ పార్టీ తనకు ఎలాంటి విప్ సైతం జారీ చేయలేదని గుర్తుచేశారు. అయితే, తనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ వేసిన వాళ్లకు ఏం అర్హత ఉందని దానం నాగేందర్ ప్రశ్నించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి ఎన్నడూ వ్యతిరేకంగా పనిచేయలేదని పేర్కొన్నారు. ఫిరాయింపుల విషయంలో తన తప్పు ఏమీ లేదని.. తప్పుగా చిత్రీకరించిన బీఆర్ఎస్, ఆ పార్టీ నేతలతే తప్పని స్పష్టంచేశారు.
KTR : కేటీఆర్‌ది ఆవేదనా? ఆగ్రహమా?
దానం నాగేందర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఓడిపోయాక సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని పలుమార్లు ప్రకటించారు.ఆ తర్వాత మరల తాను కాంగ్రెస్‌లో చేరలేదని, బీఆర్ఎస్‌లోనే ఉన్నట్టు స్పీకర్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రస్తావించారు. ఇదిలాఉండగా, బీఆర్ఎస్ పార్టీ దానం నాగేందర్‌ను సస్పెండ్ చేసినట్టు సుప్రీంకోర్టులో కేటీఆర్ అఫిడవిట్ దాఖలు చేశారని ఇటీవల బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్ని కారు పార్టీ దాచిందని అన్నారు.బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదని తాజాగా దానం నాగేందర్ స్పష్టంచేశారు. కాగా, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? అనేది క్లారిటీ రావాల్సి ఉన్నది. కాగా, కేటీఆర్, కేసీఆర్ దానంకు విప్ జారీ చేస్తారా? ఆయన్ను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తారా? పిలిచి మాట్లాడుతారా? అనేదానిపైనా ఉత్కంఠ నెలకొన్నది.