36,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని అకస్మాత్తుగా గుర్తు తెలియని వస్తువు ఢీకొట్టింది. అది కాక్ పిట్ గ్లాస్ విండోను ఢీకొట్టింది. ఈ ఘటనలో పైలెట్ గాయపడ్డాడు. వెంటనే అలర్ట్ అయిన కో పైలెట్ పగిలిపోయిన గాజు కాక్ పిట్ ను గాలి లోపలికి రాకుండా చేశాడు. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. డెన్వర్ నుంచి లాస్ ఏంజిల్స్ కు వెళ్తుండగా యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 MAX 8 విమానం ఈ ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఓ పైలెట్ గాయపడటంతో అతడిని హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన గురవారం జరింది. ప్రమాద సమయంలో విమానంలో 134 మంది ప్రయాణీకులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో పైలట్ చేతులు గాయాలై, రక్తస్రావం అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. గాజు పగిలి పెంకులు గుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఫ్లైట్ డాష్ బోర్డ్, కాక్ పిట్ కూడా పగిలిన గాజు పూత పూసినట్లు తెలుస్తోంది. మరికొన్ని ఫోటోల్లో వింత వస్తువు ఢీకొన్న ప్రదేశంలో కాలిన గుర్తులు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన కారణం గురించి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ పూర్తి వివరాలను వెల్లడించలేదు. “గురువారం, యునైటెడ్ విమానం విండ్ షీల్డ్ కు మిస్టీరియస్ వస్తువు తగిలింది. పైలెట్ గాయపడ్డాడు. వెంటనే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సాల్ట్ లేక్ సిటీలో సురక్షితంగా ల్యాండ్ అయింది” అని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. అటు “వెంటనే అక్కడి నుంచి లాస్ ఏంజిల్స్ కు ప్రయాణీకులను తీసుకెళ్లడానికి మరొక విమానాన్ని ఏర్పాటు చేశాం. మా మెయింటెనెన్స్ టీమ్ విమానాన్ని సరిచేయడంతో పాటు తిరిగి సర్వీసులు అందించేలా రెడీ చేస్తున్నారు. విమానం విండ్ షీల్డ్ లు సురక్షితంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని వెల్లడించింది.
ఈ ఘటన అక్టోబర్ 16న జరిగింది. సాల్ట్ లేక్ సిటీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యే ముందు విమానం 26,000 అడుగుల ఎత్తుకు దిగింది. తరువాత ప్రయాణీకులను మరొక విమానం (బోయింగ్ 737 MAX 9)లో లాస్ ఏంజిల్స్ కు తీసుకెళ్లారు. ఈ ప్రమాదం కారణంగా ప్రయాణం 6 గంటలు ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం ఈ సంఘటనకు కారణమేమిటో స్పష్టంగా తెలియడం లేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తెలిపింది. అంతరిక్షం నుంచి వచ్చిన శిథిలాలు ఈ ప్రమాదానికి కారణం అయినట్లు భావిస్తున్నట్లు తెలిపింది. నిజానికి ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా అభివర్ణించింది. విద్యుత్ లోపం వల్ల విండ్ షీల్డ్ పగుళ్లు ఏర్పడి ఉండవచ్చని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కాలిన గుర్తులు, పగిలిన గాజు విమానం ఏదో ఒకదానితో ఢీకొన్నట్లు సూచిస్తున్నాయన్నారు. పక్షులు, వడగళ్ళు, ఇతర వస్తువులు తక్కువ ఎత్తులో విమానాలను ఢీకొనే అవకాశం ఉందని. ఈ విమానం ఏకంగా 36,000 అడుగుల ఎత్తులో ఉన్న నేపథ్యంలో అలాంటి అవకాశం లేదన్నారు. త్వరలోనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
Read Also: నీటితో నడిచే కారు, ఇరాన్ శాస్త్రవేత్త అద్భుత సృష్టి!