Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ప్రస్తుతం తిరిగి సినిమాలలో బిజీ అవుతున్న తరుణంలో కొంతమంది దర్శకులు ఆయనతో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఓజీ యూనివర్స్ నుంచి సినిమాలు రాబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమాలను స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఈయనకు సినిమాల పట్ల ఉన్న ఆసక్తి తెలిసిన కొంతమంది దర్శక నిర్మాతలు పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఆయనని సంప్రదిస్తూ తనతో సినిమా చేయటానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ తో కొత్త సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నారంటూ గత రెండు రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతోంది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయటం కోసం దర్శకుడు మెహర్ రమేష్(Meher Ramesh) పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ ని కలిసి సినిమా చేయటానికి పవన్ కళ్యాణ్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో మెహర్ రమేష్ తరచుగా పవన్ కళ్యాణ్ ని కలిసారని అలాగే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లొకేషన్ లో కూడా పవన్ కళ్యాణ్ ని కలిసారని తెలుస్తోంది.
ఇలా పవన్ కళ్యాణ్ అనుమతి కోసం దర్శకుడు మెహర్ రమేష్ పడిగాపులు కాస్తున్నారనీ, పవన్ కళ్యాణ్ ఎస్ అని చెప్పడమే ఆలస్యం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఈ వార్తలపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతూ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. అయ్యా మీకు, మీ సినిమాకు దండం నువ్వు మాత్రం మా హీరోతో సినిమా చేయొద్దు అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ గారు మీతో సినిమా చేయడానికి ఒప్పుకుంటే ఆ సినిమా మీద మేము ఆశలు వదులుకోవాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మా హీరోతో సినిమాలు వద్దు..
మెహర్ రమేష్ పేరు చెప్పగానే ఫ్లాప్ డైరెక్టర్ అనే పేరు ఇండస్ట్రీలో ఉంది. ఈయనతో సినిమాలు చేయడానికి హీరోలు దాదాపు వెనుకడుగు వేస్తారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలను చూస్తే కనుక అన్నీ కూడా డిజాస్టర్లే ఉన్నాయని చెప్పాలి. ఇక ఈయన చివరిగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్(Bhola Shankar) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ కు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఈయన ఎంతో తాపత్రయపడుతున్నారు. మరి అనుకున్న విధంగానే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ అందుకుంటారా? లేదా? అనేది తెలియాల్సింది. అయితే ఈ విషయంపై అభిమానులు మాత్రం మెహర్ రమేష్ కి దండం పెడుతూ నువ్వు మాత్రం మా హీరోతో సినిమాలు చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు.