KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని, పెద్దఎత్తున దొంగ ఓట్లను సృష్టించి గెలవాలని చూస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న దొంగ ఓట్ల (చోరీ కా ఓట్)పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తీవ్రమైన ఆరోపణలు చేశారు.
2023 శాసనసభ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్‌లో మొత్తం 3,75,000 ఓట్లు ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 3,98,000 కు పెరిగిందని అధికారులు చెబుతున్నారు… మరి ఇంత తక్కువ సమయంలో 23,000 ఓట్లు పెరగడంపై కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, మొత్తం 12వేలకు పైగా దొంగ ఓట్లను సృష్టించారని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇష్టానుసారంగా వేల సంఖ్యలో ఫేక్ ఓట్లు పంపిణీ చేశారని ఫైరయ్యారు. ఆయనపై ఇప్పటికే కేసు కూడా నమోదైందని తెలిపారు
దొంగ ఓట్ల లెక్కల గురించి కూడా కేటీఆర్ ప్రెజెంటేషన్ లో వివరించారు. సంస్కృతి అవెన్యూ అపార్ట్‌మెంట్‌లో 43 దొంగ ఓట్లు నమోదయ్యాయని అన్నారు. బూత్ నెంబర్ 125 లో 25 ఫేక్ ఓట్లు నమోదు అయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్‌కు రెండు ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. దొంగ ఓట్ల పంపిణీకి కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబ సభ్యులే పాల్పడ్డారని ఆయన నిందించారు.
ALSO READ: Konda Surekha: మేడారం టెండర్ల విషయంలో మంత్రి కొండా సురేఖ ఆసక్తికరమైన వ్యాఖ్యలు.. నా ఉద్దేశమదే..!
దొంగ ఓట్ల వ్యవహారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) కి ఫిర్యాదు కూడా చేశారు. మూడు ప్రధాన అంశాలపై ఆయన డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫేక్ ఓట్లపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే దొంగ ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. ఎన్నికల కమిషన్ పై తమకు నమ్మకం లేదని పరోక్షంగా తెలియజేస్తూ.. ఫేక్ ఓట్లను తొలగించకపోతే కోర్టుకు వెళ్తామని ఫైరయ్యారు.
ALSO READ: Election Commission: అది ఇల్లు కాదు అపార్ట్మెంట్.. కేటీఆర్‌కు ఈసీ షాక్
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గెలవబోతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తూనే.. మరో వైపు కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తుందనే ప్రధాన ఆరోపణ చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని చెబుతూ.. ఈ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.