Rajgopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ట్రెండింగ్‌లో నిలిచారు. ఎక్సైజ్ నిబంధనలకు తోడు నియోజకవర్గ ఎమ్మెల్యే సొంత నిబంధనలు ఖరారు చేయడం మునుగోడు జిల్లా నియోజకవర్గంలో సంచలనంగా మారింది. నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు, గట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ, నాంపల్లి, చౌటుప్పల్, సంస్థన్ నారాయణపురం మండలాలలో వైన్ షాప్స్ టెండర్స్ వేసే ఆశావహులు టెండర్లు వేయాలంటే షరతులు పాటించాలని హుకుం జారీ చేశారు రాజగోపాల్.
రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలని రూల్
షరతులు పాటించని వారు టెండర్స్ వేయవద్దని, వైన్ షాప్స్ నిర్వాహకులు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలని సూచించారు.
మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని సూచన
మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని, ఇతర మండలానికి చెందిన వ్యక్తులు టెండర్లు వేయవద్దని స్పష్టం చేశారు. వైన్ షాప్‌లు ఊరి బయట మాత్రమే పెట్టాలని, వైన్ షాప్ కు అనుబంధంగా పర్మిట్ రూమ్ ఉండొద్దన్నారు. ముఖ్యంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మవద్దని , లాటరీ విధానంలో వైన్స్ షాప్ లు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదని పేర్కొన్నారు. ఈ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్టు షాప్‌ల నిర్మూలన, మహిళల సాధికారతే తన ఉద్దేశమన్నారు రాజగోపాల్‌రెడ్డి.
వైన్ షాప్‌లు ఊరి బయట మాత్రమే పెట్టాలన్న రాజగోపాల్
గ్రామాలలో పర్యటిస్తున్న సందర్భంలో యువత తాగుడుకు బానిసై విచక్షణారహితంగా ప్రవర్తించడం చూశానని, ఎంతోమంది యువకులు 30 ఏళ్ల లోపు వారే తాగుడుకు బానిసై చనిపోతే మహిళలు చిన్నతనంలోనే భర్తను కోల్పోతున్నారని తెలిపారు ఎమ్మెల్యే. కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని తమ పిల్లలను పోషించడానికి వారు పడరాని పాట్లు పడుతున్న ఆవేదనలో నుండి వచ్చిన నిర్ణయమే బెల్ట్ షాపుల నిర్మూలన, మద్యం షాపుల సమయాల మార్పు అని కోమటిరెడ్డి చెబుతున్నారు.
ఎక్సైజ్ సూపరిండెంట్‌కు వినతిపత్రం అందించిన అనుచరులు
రాజగోపాల్ రెడ్డి పిలుపుమేరకు మునుగోడు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపర్ ఇండెంట్ కార్యాలయంలో వైన్ షాప్ టెండర్లు వేసే వారికి గమనిక అంటూ వినతి పత్రాన్ని ఎక్సైజ్ సూపరిండెంట్ కు అందించారు.