Kalvakuntla Kavitha: తెలంగాణలో గ్రూప్-1 వివాదం రోజు రోజుకి ముదురుతోంది. ఈ క్రమంలో కల్వకుంట్ల కవిత విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు.. మంగళవారం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చారు. కానీ అక్కడ ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులతో మాట్లాడకుండా అడ్డుకోవడంతో.. కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెంట్రల్ లైబ్రరీ ప్రధాన గేటు వద్దనే కవిత బైఠాయించి ఆందోళన చేపట్టారు. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విద్యార్థులు న్యాయం కోరుతున్నారు. ఈ పరీక్షలో పారదర్శకత లేకపోవడమే సమస్యకు మూలం. ప్రభుత్వం న్యాయమైన రీతిలో రిక్రూట్‌మెంట్ నిర్వహించి ఉంటే రాత్రికి రాత్రే అపాయింట్‌మెంట్ లు ఇవ్వాల్సిన అవసరం ఎందుకుండేది? అని ప్రశ్నించారు.
కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో అవకతవకలు జరిగాయని విద్యార్థులు చెబుతున్నారు. కానీ ఆ సమయంలోనూ న్యాయం జరగాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల సమస్యలు మారడం లేదు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్, ఇప్పటివరకు పాత 50 వేల పోస్టులకే నియామకాలు ఇచ్చింది. కొత్త నోటిఫికేషన్లు ఒక్కటీ రావడం లేదు అంటూ కవిత ఫైర్ అయ్యారు.
గ్రూప్-1 పరీక్షల్లో అన్యాయం స్పష్టంగా కనిపిస్తోందని కవిత ఆరోపించారు. ప్రతి విద్యార్థి తన పేపర్‌ను పబ్లిక్ చేయమని ఛాలెంజ్ చేస్తున్నాడు. కానీ ప్రభుత్వం మాత్రం ర్యాంకర్ల పేపర్లు బయటపెట్టేందుకు భయపడుతోంది. అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇవ్వడం ఎందుకు? ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడటమే అని విమర్శించారు.
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉల్లంఘించి నాన్-లోకల్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారని కవిత ఆరోపించారు. తెలుగు, ఉర్ధూ మీడియం విద్యార్థులకు అన్యాయం చేశారు. ఈ వ్యవహారంలో పోలీసుల పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది. అప్పుడు, తమ పిల్లలకే అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతున్నారు? అని పోలీసులను ఉద్దేశించి ప్రశ్నించారు.
కవిత రాహుల్ గాంధీపై కూడా విమర్శలు చేశారు. బీహార్ ఎన్నికల్లో బిజీగా తిరుగుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణ విద్యార్థుల సమస్యలు కనిపించడం లేదా? ఇక్కడికి రావాలి, లేకపోతే మేమే బీహార్‌కి వెళ్లి విద్యార్థుల గళం వినిపిస్తాం అని హెచ్చరించారు.
రేపు కోర్టులో విచారణ ఉన్నందున.. న్యాయస్థానం విద్యార్థుల పక్షాన ఆలోచించాలని కవిత కోరారు. న్యాయం జరగకపోతే సుప్రీం కోర్ట్ దాకా వెళ్తాం. గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి, మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహించాలి అని డిమాండ్ చేశారు.
Also Read: అయ్యో ఎంత ఘోరం! కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. 15 మంది సజీవ దహనం
ఈ ఆందోళనలో కవిత విద్యార్థులతో కలిసి చాయ్ తాగి మాట్లాడారు. ఈ పోరాటం మీకోసం, మీ భవిష్యత్తు కోసం” అంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని, గ్రూప్ – 1లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కవితను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.సెంట్రల్ లైబ్రరీ వద్ద ఆందోళన చేస్తున్న.. పలువురు జాగృతి నాయకులపై కూడా పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది.