Jubilee Hills By Election: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు త్వరలో తెరపడనుంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ(సోమవారం) ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఈసారి నవంబర్ 11న నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది నమోదిత ఓటర్లు ఉన్నారు, వీరందరూ తమ ఓటు హక్కును వినియోగించగలరు.
ఉప ఎన్నికలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో.. ఇలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVMs) వీవీ ప్యాట్ (VVPAT) యంత్రాలను వినియోగించనున్నారు. అవసరమైన యంత్రాలు ఇప్పటికే పరీక్షించి సిద్ధం చేశామని, పోలింగ్ సాఫీగా జరగేందుకు అన్ని సాంకేతిక, భద్రతా చర్యలు తీసుకున్నామని సీఈవో సుధర్షన్ రెడ్డి చెప్పారు.
ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డు (EPIC)తో పాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ప్యాన్ కార్డు, పెన్షన్ పత్రం వంటి గుర్తింపు పత్రాలతో ఓటు వేయవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 13
నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్ 21
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 22
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్ 24
పోలింగ్ తేదీ: నవంబర్ 11
ఓట్ల లెక్కింపు: నవంబర్ 14
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి.. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. అయితే, ఈ ఏడాది జూన్‌లో ఆయన గుండెపోటు కారణంగా కన్నుమూశారు. దీని వల్ల ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ కేటీఆర్ ఆధ్వర్యంలో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతా గోపీనాథ్‌కు టికెట్‌ను కేటాయించింది.
ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ సీటుపై అభ్యర్థులుగా.. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సి.ఎన్. రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వీరిలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ సర్కార్ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిని త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉంది.