Cockroach In Food: హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా దాడులు చేస్తూ.. నిబంధనలు పాటించని వాటిపై చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ రెస్టారెంట్ల నిర్వాహకుల్లో మార్పు రావడం లేదు. కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
నానక్ రామ్ గూడ కృతుంగ హోటల్ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాగి ముద్దలో బొద్దింక ప్రత్యక్షమైంది. బొద్దింకను షాక్ అయిన కస్టమర్.. హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. అయితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ కిచెన్ పరిసరాలు అత్యంత దారుణంగా ఉన్నాయని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. కిచెన్ పరిసరాల్లో దుర్వాసన వస్తుందంటున్నారు.
రాగి ముద్దలో బొద్దింక ప్రత్యక్షమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అపరిశుభ్రమైన కిచెన్ పరిసరాల కారణంగానే ఆహారంలో కీటకాలు వస్తున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. హోటల్ నిర్వాహకులు కస్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరుతున్నారు.
ఇటీవల ముషీరాబాద్‌లోని అరేబియన్ మండి రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక రావడంతో కస్టమర్ షాక్ కు గురయ్యాడు. ఇదేంటని రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కస్టమర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఖమ్మంలోని కోణార్క్ హోటల్‌లో ఇలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టాడు మేడిశెట్టి కృష్ణ అనే వ్యక్తి. బిర్యానీ సగం తిన్నాక.. అందులో చనిపోయిన బొద్దింక కనిపించింది. దీంతో కస్టమర్ హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.