Kalvakuntla Kavitha: రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కవిత రాష్ట్ర రాజకీయాలు, ప్రజల సమస్యలు, ప్రధాన పార్టీల వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. తాను ఎవరి బాణాన్నీ కాదని.. తెలంగాణ ప్రజల బాణాన్ని అని వ్యాఖ్యానించారు. ‘ప్రజల తరఫున పోరాడాల్సిన పార్టీలు ఆ పని చేయడం లేదు. కొన్ని పార్టీలను నమ్ముకొని దగాపడ్డాం అని ప్రజలు నాతో చెబుతున్నారు’ అని అన్నారు. తమ ప్రాధాన్యం ప్రజల సమస్యలు తీర్చడమేనని.. తాము ప్రజల గొంతుకగా మారతామని చెప్పారు.
ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాయని అన్నారు. మొంథా తుపానుతో నష్టపోయిన రైతులను, వరంగల్ నగరంలో వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా నల్ల చట్టాలు తెచ్చినా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు చేయాల్సినంత పోరాటం చేయలేదని విమర్శించారు. రైతు చట్టాల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ కార్మికులకు అన్యాయం చేసే లేబర్ చట్టాల గురించి మాట్లాడలేదని అన్నారు. పోరాడితే తప్ప ఏదీ రానటువంటి పరిస్థితిని తీసుకొచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పేదవారికి విద్య, వైద్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాల్సిన అవసరముందని కవిత నొక్కి చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోతే ఆడపిల్లల చదువులు ఆగిపోతాయన్న ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర కాలంలో వెల్ఫేర్ హాస్టల్స్‌లో 110 మంది పిల్లలు చనిపోవడం దారుణమని, శ్రీ వర్షిత మరణంపై ఏం జరిగిందో తెలియాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ సాధనలో భాగంగా బీసీ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, లేకపోతే మాట్లాడే నైతిక హక్కు కోల్పోతామని పిలుపునిచ్చారు.
ALSO READ: Hyd Metro Timings Revised: మారిన హైదరాబాద్ మెట్రో రైళ్ల టైమింగ్స్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే?
కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మాఫియాపై పోరాటం చేస్తానని అన్నారు. గతంలో లాగా కాదని.. ఇప్పుడు ఫ్రీ బర్డ్‌నని తెలిపారు. గ్రానైట్ ఆదాయాన్ని జిల్లా అభివృద్ధికి వినియోగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కావడం లేదని.. కనీసం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కూడా లేదని విమర్శించారు. హుజురాబాద్, మానకొండూరు రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, కల్వకుంట్ల ప్రాజెక్టు మత్తడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. రామడుగు శిల్పకళాకారుల కోసం ఐదు ఎకరాల స్థలం, ఉచిత కరెంటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జనం బాట పూర్తైన తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. లోకల్ బాడీ ఎన్నికల సమయంలోనే ఏం చేయాలన్నది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దగాపడ్డ ఉద్యమకారులను అక్కున చేర్చుకుంటామని.. పరిహారం అందని అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల నుంచి చాలా అద్భుతమైన స్పందన వస్తోందని.. సమస్యలు తీరాలంటే పిడికిలి బిగించి ఉద్యమం చేయాలి అని ఆమె వ్యాఖ్యానించారు.