KA Paul : కేఏ పాల్. మునుగోడులో ఆయన హంగామా అంతాఇంతా కాదు. ఖబర్దస్త్ ను మించిన కామెడీ. గెలిచేది తానేనంటూ సవాల్. తెలంగాణకు కాబోయే సీఎం అంటూ స్టేట్ మెంట్స్. పది వేళ్లకు 10 ఉంగరాలతో.. ఉంగరం గుర్తుకే మీ ఓటు అంటూ తెగ హల్ చల్. డ్యాన్సులు, కామెడీ పంచ్ లతో.. మునుగోడు ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మరి, ఇంత హడావుడి చేసిన ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చాయో అనే ఆసక్తి తెలుగువారందరిలో నెలకొంది.
డిపాజిట్ కూడా రాలేదు కేఏ పాల్ కు. చిత్తు చిత్తుగా నవ్వించిన ఆయన.. మునుగోడులో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. సుమారు 200 ఓట్లతో సరిపెట్టుకున్నారు. కాలికి బలపం కట్టుకుని తిరిగినట్టు ఊరూరా ప్రచారం చేస్తే.. ఓటేసే వారే కరువయ్యారు. మీడియా అటెన్షన్ అయితే డ్రా చేశారు కానీ.. ఓటర్లను మెప్పించలేకపోయారు. ఇలాంటి వారిని జస్ట్ టైమ్ పాస్ పీస్ గానే చూస్తామన్నట్టు.. ఓటర్లు పాల్ కు డిపాజిట్ గల్లంతు చేసి గట్టి షాక్ ఇచ్చారు. ఆ రెండు వందల ఓట్లైనా ఎవరు వేశారంటూ స్థానికులు కామెడీ చేస్తున్నారు.
అయితే, ఓటమిని అసలేమాత్రం ఒప్పుకోవడం లేదు కేఏ పాల్. ఈవీఎంలతో మాయ చేశారని.. లక్షకు పైగా ఓట్లు తనకే వచ్చినట్టు చెప్పారు. డౌట్ ఉంటే, బ్యాలెట్ పేపర్ పెడితే ఈ విషయం రుజువు చేస్తానని సవాల్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు భారీగా అవినీతికి పాల్పడ్డాయని.. మునుగోడు ఎలక్షన్ ను రద్దు చేయాలని.. ఆయా పార్టీల అవినీతిపై కోర్టుకు వెళ్లి తేల్చుకుంటానంటూ ఛాలెంజ్ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.