Blue Tick Charges : ట్విట్టర్లో స్పెషల్ ఫీచర్స్ అందించే బ్లూ టిక్ సర్వీసులకు నెలకు 8 డాలర్లు వసూలు చేస్తానని ప్రకటించిన మస్క్… ఐదు దేశాల్లో ఆ చార్జీలను అమల్లోకి తెచ్చారు. అయితే… ముందుగా ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే బ్లూ టిక్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు… భారత్ లో బ్లూ టిక్ సేవలు ప్రారంభించడానికి మరో నెలరోజులు పట్టొచ్చని చెప్పారు… మస్క్.
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్లో ఐఫోన్ యూజర్లకు… నెలకు 7.99 డాలర్లు చెల్లించి ట్విట్టర్ బ్లూ టిక్ కి సైనప్ కావొచ్చనే నోటిఫికేషన్ వచ్చింది. ట్విటర్ బ్లూకి గొప్ప ఫీచర్లను జత చేస్తున్నామని… భవిష్యత్ లో మరిన్ని ఫీచర్లను జోడిస్తామని ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నట్లు… పలువురు ఐఫోన్ యూజర్లు చెప్పారు. అయితే ఓ యూజర్… భారత్‌లో బ్లూ టిక్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభిస్తారని మస్క్‌ను ప్రశ్నించాడు. దాంతో ఆయన… ఒక నెలలోపు ప్రారంభం కావొచ్చని సమాధానమిచ్చారు.
బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి ప్రముఖుల మాదిరే బ్లూ చెక్‌మార్క్‌తో పాటు తక్కువ ప్రకటనలు, ఎక్కువ నిడివిగల ఆడియో, వీడియోలను పోస్ట్ చేసే అవకాశం వంటి అదనపు ఫీచర్లను అందించబోతోంది… ట్విట్టర్. దీనికి ఛార్జీలు విధించడంపై విమర్శలు వచ్చినా… మస్క్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. భవిష్యత్ లో ట్విట్టర్‌లో చేయబోయే మార్పులనూ ఆయన వెల్లడించారు. సుదీర్ఘ సందేశాలను కూడా పోస్ట్ చేసేలా మార్పులు చేస్తున్నట్లు మస్క్ చెప్పారు. ప్రస్తుతం పదాల విషయంలో పరిమితి ఉండటంతో… చాలా మంది నోట్‌ప్యాడ్‌లో సందేశాన్ని రాసి.. దాన్ని స్క్రీన్‌షాట్ తీసి ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఇబ్బందులను తొలగించడానికే పెద్ద పెద్ద సందేశాలను కూడా పోస్ట్ చేసేలా మార్పులు చేయబోతున్నామని మస్క్ చెప్పారు. అంతేకాదు… యూట్యూబ్ లాగే ట్విట్టర్ కంటెంట్ క్రియేటర్లకూ డబ్బు చెల్లించబోతున్నామని సంకేతమిచ్చాడు… మస్క్. ప్రస్తుతం యూట్యూబ్ తన ప్రకటనల ఆదాయంలో 55 శాతం కంటెంట్ యూజర్లకే ఇస్తుండగా… అంతకన్నా ఎక్కువే ఇస్తామని ఊరిస్తున్నాడు… మస్క్.