Kavitha: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో కీలక నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా అధికార పార్టీతోపాటు విపక్ష బీఆర్ఎస్‌ని ఏకి పారేశారు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. ‘బిగ్‌టీవీ’తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు.
తెలంగాణలో అధికార-విపక్షాల మధ్య జరుగుతున్న రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్‌ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె, ‘బిగ్ టీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏం సాధిస్తారని ప్రత్యర్థులపై విమర్శలు సంధించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ కేవలం సోషల్ మీడియాకు పరిమితం అయ్యిందని మనసులోని మాట బయటపెట్టారు.
టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందనే భయంతో బీఆర్ఎస్ నేతలు తనపై ఎదురుదాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ఏర్పడిన నుండి ఇప్పటివరకు కృష్ణనదిపై ప్రాజెక్ట్‌లు ఎందుకు ఏర్పాటు చేయలేదో బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గడిచిన మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డిలో తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదు కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పి తీరాలన్నారు. జల దోపిడీ జరిగింది వాస్తవమని మరోసారి కుండబద్దలు కొట్టేశారు.
వ్యవసాయం కోసం ఏపీ వాళ్ళు పని చేసుకుంటున్నారని, కానీ మన పార్టీలు రాజకీయ ఉనికి కోసం పని చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజి నుండి ఆంధ్రాకు నీటి తరలింపు అందరూ ఐక్యంగా వ్యతిరేకించాల్సిందేనన్నారు. ఏపీలో అధికార మార్పిడి జరిగినా ప్రజా ప్రయోజనాలు ఏనాడూ పక్కన పెట్టలేదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో అధికార పక్షం- ప్రతిపక్షం తిట్టుకోవడం ఆపుకొని కట్టడాలు మొదలు పెట్టాలన్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనని అన్నారు.
ఇంటర్ బోర్డు విషయంలో ప్రభుత్వం ఎవరితో చర్చలు జరపలేదన్నారు. బీజేపీ ఎంపీలు తెలంగాణ బిడ్డలైతే కరువు బత్యం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్ కంటే నేను చేసిన అభివృద్ధి చాలా ఎక్కువన్నారు. పసుపు బోర్డు కంటే టీ, కాఫీ, టొబాకో బోర్డులు బెటరని అన్నారు. పాంచజన్య పేరుతో భైరవ యాత్రతో చాలా విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పాంచజన్య సంకల్పం నిజం చేసుకుంటే తెలంగాణ బాగుపడుతుందని చెప్పుకొచ్చారు.