Seethakka Remarks: కల్వకుంట్ల కవిత ఒక మీడియాతో మాట్లాడిన మాటలను తాను ఊటంకిస్తున్న సందర్బంలో దొర్లిన పొరపాటుకు చింతిస్తున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు.ములుగులో చేయూత నూతన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఫైలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ బాధితులకు కూడా పెన్షన్లు మంజూరు చేసిన విషయాన్ని తాను ప్రస్తావించినట్లు మంత్రి తెలిపారు.
అనంతరం అదే అంశాలపై మీడియా మాట్లాడుతున్న క్రమంలో కల్వకుంట్ల కవిత ఒక మీడియా సంస్థతో మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావించే సందర్భంగా పొరపాటు జరిగిందని వివరించారు. ఆ పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నప్పటికీ, కవితపై ఉన్న రాజకీయ కోపంతో బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఆ వ్యాఖ్యలను వైరల్ చేయడం దారుణమని మంత్రి సీతక్క అన్నారు. రాజకీయ కక్షతో తనను క్యాన్సర్ పేషెంట్ గా బీఆర్ఎస్ చీత్రీకరించిట్లు కవితే ఓ మీడియా ఛానెల్ కు చెప్పిన విషయాన్ని తాను ప్రస్తావించానని తెలిపారు.
కవిత ను కావాలని అన్న పదం కాదు.. దొర్లిన పదం.. వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించినా.. బీఆర్ఎస్ ట్రోల్ చేయడం దారుణమన్నారు. వరంగల్ పర్యటన సందర్భంగా చేయుత పెన్షన్లపై కేటీఆర్ చేసిన తప్పుడు ప్రచారాన్ని తాను తిప్పికొట్టాననే అక్కసుతోనే తన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొంటానని, వ్యక్తిగత విమర్శలు చేయడం తన నైజం కాదని సీతక్క అన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసన్నారు.
Also Read: రూ.కోటి బీమా పాలసీ.. గుండెపోటుతో వ్యక్తి మరణం.. చెల్లింపు నిరాకరించిన కంపెనీ.. కోర్టు తీర్పు ఇదే