కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారులు చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో అరెస్టైన ఉద్యమకారులను విడిపించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా రంగంలోకి దిగారు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించిన వారిని పరామర్శించిన ఆమె వారితో పాటు అక్కడే బైఠాయించారు. పోలీసులు ఉద్యమకారులను విడుదల చేసే వరకు తాను కదిలేది లేదని భీష్మించుకోవడంతో అధికారులు దిగిరాక తప్పలేదు. చివరకు అందరినీ విడుదల చేయించిన తర్వాతే ఆమె వారిని వెంటబెట్టుకుని ఠాణా నుంచి బయటకు వచ్చారు.
రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించిన అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆ హామీలు అమలు కాకపోవడంపై ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం సచివాలయం ముట్టడికి బయల్దేరిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మెహదీపట్నం నాంపల్లి పంజాగుట్ట వంటి పలు పోలీస్ స్టేషన్లకు వారిని తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కవిత వెంటనే మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ అక్కడే నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారులను జైలుకు పంపడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఉద్యమకారులకు భూమి పెన్షన్ ఇస్తామని ఆశ చూపి ఇప్పుడు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఉద్యమకారుల బిల్లు పెడతామని మాట ఇచ్చి ఇప్పుడు ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారు ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.
ప్రభుత్వ అలసత్వాన్ని జాగృతి సహించబోదని కవిత స్పష్టం చేశారు. ఉద్యమకారులకు రావాల్సిన భూములను ప్రభుత్వం కేటాయించకుంటే జాగృతి ఆధ్వర్యంలోనే భూపోరాటాలు నిర్వహిస్తామని ప్రకటించారు. అవసరమైతే భూములను ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ దిశగా జాగృతి కార్యచరణ ప్రారంభించిందని గుర్తుచేశారు. తెలంగాణ గడ్డపై హక్కుల సాధన కోసం కొట్లాడటం కొత్తేమీ కాదని ఉద్యమకారులకు ధైర్యం చెప్పారు. కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్న మనకు హక్కులు సాధించుకోవడం పెద్ద విషయం కాదని భరోసా ఇచ్చారు.
చివరగా ఉద్యమకారులందరినీ పోలీసులు విడుదల చేసే వరకు కవిత స్టేషన్ నుంచి కదలలేదు. ఇతర ప్రాంతాల్లో అరెస్ట్ అయిన వారిని కూడా వదిలిపెట్టాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అందరూ క్షేమంగా బయటకు వచ్చిన తర్వాతే ఆమె అక్కడి నుంచి వెనుతిరిగారు. కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తుందని ఈ సందర్భంగా కవిత చెప్పారు.
Also Read: రాష్ట్రంలో మెట్రో, ఎంఎంటీఎస్ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు అందరి చూపు అటువైపే..?