Ring Rail: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్ని మార్చే మరో భారీ ప్రాజెక్టు అడుగులు పడుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్’ కు సమాంతరంగా, సరికొత్తగా ‘రీజనల్ రింగ్ రైల్’ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాథమిక గ్రీన్ సిగ్నల్ రావడంతో, అటు రైల్వే శాఖ, ఇటు రాష్ట్ర యంత్రాంగం పనుల్లో వేగం పెంచాయి. హైదరాబాద్ చుట్టూ సుమారు 564 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన ఈ రైల్వే లైన్, నగరానికి చక్రంలా మారనుంది. ఇది కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా, సరుకు రవాణాకు వెన్నెముకలా నిలవనుంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కేంద్ర రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు, రూట్ మ్యాప్‌పై ప్రాథమిక అవగాహన కుదిరింది.అంతేగాక రైల్వే అధికారులు ,రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య తాజాగా ఓ కీలక మీటింగ్ జరిగింది. ఇందులో భూసేకరణ, అలైన్‌మెంట్ , స్టేషన్ల గుర్తింపుపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది.
ఈ కొత్త ప్రాజెక్టు ట్రిపుల్ ఆర్ కు అనుసంధానంగా రింగ్ తరహాలో ఏర్పాటు కానున్నది. అయితే ట్రిపుల్ ఆర్ పబ్లిక్ ఏరియాల నుంచి దూరంగా నిర్మాణం కానుండగా, రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ముందుకు సాగనున్నది. ఈ మేరకు సరిహద్దు ప్రాంతాలలో రైల్వే లైన్ ఎటువైపు నుంచి వెళ్లాలి? ఎక్కడ జంక్షన్లు ఏర్పాటు చేయాలి? అనే అంశాలపై ప్రత్యేక బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభించాయి. క్షేత్రస్థాయి నుంచి పబ్లిక్ ఫీడ్ బ్యాక్ ను కూడా స్వీకరించనున్నాయి. పైగా ట్రిపుల్ ఆర్ కంటే స్పీడ్ గా ఈ రైల్వే ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరోవైపు ఎంఎంటీఎస్ , మెట్రో రైళ్లతో దీనిని అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నారు. దీంతో పబ్లిక్ జర్నీ మరింత సులువుగా మారనున్నది.
Also read: రేపే తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్!
రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలను కలుపుతూ ఈ రీజనల్ రింగ్ లైన్ ఏర్పాటు కానున్నది. దీంతో వికారాబాద్, గజ్వేల్, భువనగిరి, షాద్‌నగర్ వంటి ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. సుమారు 564 కిలోమీటర్లు కవర్ చేస్తుండగా, నగరంలో ట్రాఫిక్, జిల్లాల మధ్య జర్నీ సమయం వంటివన్నీ తగ్గనున్నాయి. అయితే ట్రిపుల్ ఆర్ కంటే ముందే ఈ రైల్ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నదని ఓ అధికారి తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ చుట్టూ శాలిలైట్ టవర్స్ పెరగనున్నాయి. అంతేగాక రోడ్డు మార్గంతో పోల్చితే ట్రైన్ జర్నీ కాస్త సమయం తగ్గనున్నది. ఈ ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తయితే దక్షిణ భారత దేశంలోనే మొట్ట మొదటి భారీ రింగ్ రైల్ గా చరిత్రకు ఎక్కనున్నది.
Also read: స్పీడు పెంచిన కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీతో అసలు ప్లాన్ అదేనా..?