Kavitha: ఏపీ ప్రభుత్వం మెల్లగా అడుగులు వేస్తున్న పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ఎన్ డబ్ల్యూడీఏ గురించి ప్రధానంగా ప్రస్తావించారు.
పోయిన నెల తమిళనాడు సీఎం విజయ్ విజయవాడ వచ్చి ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సమయంలో ఇరువురు మధ్య నదుల అనుసంధానంపై చర్చ జరిగింది. ఈ విషయాన్ని విజయవాడ వేదికగా సీఎం విజయ్ వెల్లడించారు. దక్షిణాదిలో నదలు అనుసంధానం కోసం సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తు్న్నారు. ఈ విషయాన్ని కాసేపు పక్కన బెడితే..
గోదావరి- కావేరి నదుల అనుసంధానం సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) నుంచి చేపట్టాలని అధికారులు ఎన్ డబ్ల్యూడీఏ సమావేశాల్లో కోరడంపై ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. కవిత. ముఖ్యమంత్రి-కేంద్ర హోం శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఓకే చెప్పడం చూస్తుంటే.. ఈ ప్రభుత్వానికి నదీ జలాల వినియోగంపై ఇసుమంతైనా అవగాహన లేదని రాసుకొచ్చారు.
నిర్ధిష్టమైన విధానం లేదని తేటతెల్లం అవుతోందని ఆరోపించారు. పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తుందని మొదట స్పందించింది తామేనని ప్రస్తావించారు. తెలంగాణ జాగృతి తరపున రెండేళ్ల కిందట ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేశామని గుర్తు చేశారు. దీని విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని హెచ్చరించారు.
తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన 250 టీఎంసీల గోదావరి జలాలను సీఎం రేవంత్ రెడ్డి.. చంద్రబాబు ప్రభుత్వానికి గురు దక్షిణగా చెల్లించుకోవడం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల సమావేశంలోనే కాదు.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన ఏపీ-తెలంగాణ సీఎంల సమావేశంలో పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ఓకే చెప్పి మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు.
రేవంత్ సర్కార్ ఆమోదంతో ఏపీ ప్రభుత్వం పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టును నదుల అనుసంధానంలో భాగంగా చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తోందని గుర్తు చేశారు. ఈ విషయంలో రేవంత్ సర్కార్ కళ్లు తెరిచి పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు వాటిల్లే ముప్పును గుర్తించాలన్నారు. ఈ ప్రాజెక్టుపై కేంద్రం చేపట్టిన అన్ని సంప్రదింపుల నుంచి తెలంగాణ వైదొలగాలని డిమాండ్ చేశారు. పోలవరం – బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రధానమంత్రికి లేఖ రాయాలని అందులో ప్రస్తావించారు. దీనిపై అధికార ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ALSO READ: హైదరాబాద్‌లో హైడ్రా మెరుపు దాడులు.. రెండు పార్కులు స్వాధీనం.. తెల్లాపూర్‌లో అక్రమ బోర్ల తొలగింపు!