School Uniforms: స్వేచ్ఛ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూపొందించిన సర్కారీ స్కూల్ యూనిఫామ్ స్కీమ్ ప్రస్తుతం రాష్ట్ర సామాజిక-ఆర్థిక రంగాల్లో కొత్త విప్లవానికి నాంది పలికింది. దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత పారదర్శకమైన పద్ధతిలో చేపట్టిన ఈ ప్రాజెక్ట్.. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ,మహిళా సాధికారతకు ఓ సరికొత్త మోడల్‌గా నిలుస్తోంది. ఏకంగా 14 లక్షల మంది మహిళలకు చేయూతను ఇస్తూ.. 27 లక్షల మంది విద్యార్థులకు మేలు చేస్తున్నది. ఈ బృహత్తర పథకం ద్వారా ఒకేసారి రికార్డు స్థాయిలో రెండు సెక్టార్ ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతోంది.
14 లక్షల మహిళలకు ఉపాధి..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దాదాపు 14 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు కుట్టుపని ద్వారా నిరంతర ఉపాధి లభిస్తోంది. అందులో ప్రాథమికంగా 14 వేల మంది మహిళా టైలర్లకు నేరుగా యూనిఫాం కుట్టు ఆర్డర్లు ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు, కుటుంబ పోషణలో భాగస్వాములు అయ్యేందుకు ఇది కొండంత అండగా నిలిచింది. ఇక యూనిఫామ్ ద్వారా 27 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత యూనిఫామ్‌లు సకాలంలో అందుతున్నాయనీ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో సమానత్వ భావన పెంపొందడమే కాకుండా, వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గింది.
పదేళ్ల జాప్యానికి స్వస్తి .. ఏకీకృత కొనుగోలు విధానం..
గతంలో సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన యూనిఫాంలు, బూట్లు, పుస్తకాల సరఫరా తీవ్ర జాప్యంతో సాగేది. జూన్‌లో విద్యాసంవత్సరం ప్రారంభమైనా.. డిసెంబర్-ఫిబ్రవరి వరకు కూడా యూనిఫాంలు అందని పరిస్థితులు ఉండేవి. కొన్ని విద్యా సంవత్సరాల్లో వస్తువుల సరఫరానే పూర్తిగా నిలిచిపోయింది.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం ‘కేంద్రీకృత కొనుగోళ్ల విధానాన్ని’ అమల్లోకి తెచ్చింది. సంక్షేమ శాఖలన్నింటికీ విడివిడిగా కాకుండా, ఒకే గొడుగు కింద పారదర్శకంగా కొనుగోళ్లు జరిపి, పాఠశాలలు తెరిచిన తొలిరోజే సంపూర్ణ కిట్లను సరఫరా చేసే ఏర్పాటు చేసింది. దాదాపు 700 కోట్లతో అత్యంత పారదర్శకంగా టెండర్ల నిర్వహణ పూర్తి చేసింది. జాతీయ స్థాయిలో బహిరంగ ఈ-టెండర్ల ప్రక్రియ ద్వారా నాణ్యమైన క్లాత్ ను సేకరించడంతో పాటు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మహిళా సంఘాల ఖాతాల్లోకే కుట్టు కూలి జమ అయ్యేలా పక్కా నిబంధనలు రూపొందించి సర్కార్ సక్సెస్ ఫుల్ గా నిలిచింది.
చేనేత రంగానికి చేయూత..
సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 56 లక్షల మీటర్ల యూనిఫాం క్లాత్ , 6.49 లక్షల దుప్పట్లు , 3 లక్షల బెడ్షీట్లు, 2.29 లక్షల కార్పెట్ల ఆర్డర్లను ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక చేనేత సహకార సంఘాలకు ఇచ్చారు. దళిత పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇస్తూ.. టైలు, బెల్టులు, ఐడీ కార్డుల తయారీ బాధ్యతను తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ కు కేటాయించారు.
ప్రభుత్వానికి మైలేజ్..
గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో ఈ పథకం తీసుకొచ్చిన మార్పు పట్ల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.మహిళలఆత్మగౌరవం పెరిగింది. నిలకడైన ఆదాయం లభించడంతో వేలాది మహిళల జీవితాల్లో వెలుగులు నిండాయి.మరో వైపు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా కుట్టిన యూనిఫామ్‌లు లభించడంతో సర్కారీ స్కూళ్లలో అడ్మిషన్ల సంఖ్య పెరిగింది.
నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మరో కీలక నిర్ణయం..
ఈ విద్యాసంవత్సరం సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం వచ్చేవిద్యాసంవత్సరం (నెక్స్ట్ అకాడమిక్ ఇయర్) కోసం మరొక విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. స్కూళ్లు ప్రారంభానికి ముందే యూనిఫామ్ సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక ప్రైవేటు విద్యాసంస్థలకు పోటీగా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు వసతులు కల్పించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచిన మొదటి రోజే విద్యార్థుల చేతికి యూనిఫాంలు, పుస్తకాలు, సమగ్ర కిట్లు అందేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా రివ్యూ లో సూచించారు.
Also Read: క్యాన్సర్ బాధితులకు బిగ్ రిలీఫ్.. ఇక హైదరాబాద్ రానక్కర్లేదు.. జిల్లాల్లోనే ఉచిత కీమోథెరపీ!