MLC Elections: స్వేచ్ఛ బ్యూరో: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ మిత్రపక్షాలైన సీపీఐ, తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధినేతలకు విజ్ఞప్తి చేశారు.
వేర్వేరుగా కీలక సమావేశాలు
మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఈ కీలక భేటీలు జరిగాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృత్వంలోని ఆ పార్టీ బృందం, అలాగే టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని ముఖ్య నాయకుల బృందం ముఖ్యమంత్రితో వేర్వేరుగా సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా మిత్రపక్షాల బలం, గ్రాడ్యుయేట్ల మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరాన్ని రేవంత్ రెడ్డి వారికి వివరించారు.
సానుకూలంగా స్పందించిన కూనంనేని, కోదండరాం
ముఖ్యమంత్రి ప్రతిపాదనపై సీపీఐ, టీజేఎస్ నేతలు ఎంతో సానుకూలంగా స్పందించారు. సీఎం అభ్యర్థనకు సీపీఐ నాయకులు అంగీకారం తెలుపుతూ, ఈ అంశంపై త్వరలోనే తమ పార్టీ అంతర్గత సమావేశంలో చర్చించి అధికారిక నిర్ణయాన్ని వెల్లడిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చేందుకు తమ వైపు నుంచి పూర్తి సానుకూలత వ్యక్తంచేశారు.
మిత్రపక్షాల మధ్య సమన్వయం
మిత్రపక్షాల మధ్య సమన్వయం పెంచి, పట్టభద్రుల స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా జరిగిన ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, మిత్రపక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కలయిక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మరింత బలాన్నిస్తుందని నాయకులు భావిస్తున్నారు.
Also Read: నిర్మల్ గడ్డ.. కాషాయ అడ్డా! తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే: బండి సంజయ్