రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పడేశారు. ఆ పార్టీ చేసిన అవినీతి గురించి తెలిసి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అసలు కవితకు ఏం కావాలి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆమె ఒక్కొక్కరి చిట్టా విప్పుతానని ఇటీవల గులాబీ పార్టీ లీడర్లను బెదిరించడంతో వారంతా బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. మరికొందరు మేకపోతే గంభీర్యాలకు పోయి కేసీఆర్ కూతురు కాబట్టి చూస్తూ ఊరుకుంటున్నామని లేదంటే కథ వేరేలా ఉండేదని కవరింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
కవిత వరుసగా బీఆర్ఎస్ సీనియర్ లీడర్లను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అంతకు ముందు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తన మీద చేసిన విమర్శలకు ఆమె ఘాటుగానే స్పందించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లిల్లీపుట్ లీడర్ వల్లే పార్టీకి సీట్లు తగ్గాయని బాహాటంగానే విమర్శించారు. తన జోలికి వస్తే ఊరుకునేది లేదని బండారం మొత్తం బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును టార్గెట్ చేశారు. గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేసి పార్టీని ముక్కలు చేయాలని చూశారని, ఆ విషయం తెలిసే కేసీఆర్ ముందు మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ విచారణ ఎదుర్కోవడానికి హరీశ్ రావే కారణమని, రూ.వేలకోట్ల అక్రమాలకు పాల్పడింది ఆయనే అని..ఇప్పుడు అన్యాయంగా కేసీఆర్‌ను ఇరికించారన్నారు. ఇటీవల కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆరడుగుల బుల్లెట్ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉండి జిల్లాల్లో ఆస్పత్రులు కట్టించలేదని ఫైర్ అయ్యారు. రెండ్రోజుల కింద కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు కవిత మీద తీవ్ర ఆరోపణలు చేయగా..తాజాగా ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరోసారి బీఆర్ఎస్ లీడర్లను వాయించారు. ‘ కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ నేతల మీద ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. ఆ గుంటనక్కలకు చెబుతున్నా.. నా మీద అనవసర దాడి చేస్తే ఒక్కొక్కడి తోలు తీస్తా.. మీ అవినీతి చిట్టా మొత్తం విప్పుతా.. త్వరలో మీ అవినీతి చిట్టాలపై టెస్టుమ్యాచ్ ఆడుతా’ అంటూ హెచ్చరించారు.
అంతే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షపార్టీకి కవిత షాక్ ఇచ్చారు. దాన్ని తెచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కుండబద్దలుకొట్టారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నేతల అవినీతి మీద విచారణల పేరుతో సర్కారు కాలయాపన చేస్తున్నదని ఇంకెప్పుడు వారిపై చర్యలుంటాయని ప్రశ్నించింది. దీనికర్థం ఏంటి? ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ విచారణను ఎదుర్కొంటున్నారు.ఆయన అరెస్టు? ఎప్పుడు అని కవిత పరోక్షంగానే ప్రశ్నిస్తున్నారా? అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అన్న అరెస్టును కవిత కోరుకుంటున్నారా? మరోవైపు హరీశ్ రావును కూడా పార్టీ నుంచి దూరం చేసి బీఆర్ఎస్‌ను తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నారా? అని గులాబీ పార్టీలు చర్చ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.