ఇటీవల జాగృతి మీటింగ్ లో ఎమ్మెల్సీ కవిత స్టేజ్ పైకి వచ్చే సమయంలో కొంతమంది సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. కవిత వారిని వారించినట్టు కనపడలేదు. ఆ నినాదాలు విని ఆమె బాగా సంతోషించారు. ఆ తర్వాత నిదానంగా ఏయ్ అల్లరి చేయకండి అంటూ సర్దిచెప్పారు. ఆరోజు జాగృతి తరపున బయటకు వచ్చిన వీడియోల్లో ఈ సన్నివేశం లేదు. కాస్త ఆలస్యంగా ఈ వీడియో బయటకు రాగా ఇప్పుడిది వైరల్ అవుతోంది.
ఇంట్లో కుంపటి తీర్చు కెసిఆర్ ముందు!!
వైసీపీ సహవాసం చేసావ్!! అక్కడ ఆ అన్నా చెల్లి కొట్టుకుంటున్నారు, మీ ఇంట్లో మొదలైంది!!
ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ బిగిలు!! @KTRBRS #BRSPowerFighting#EndOfBRS pic.twitter.com/Mlbpeei0NL
— SBS (@SBSUSA007) July 27, 2025
కవిత సీఎం అయితే కేసీఆర్..
సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తుంటే వినడానికి బాగానే ఉంటుంది కానీ, సమయం సందర్భం లేకుండా జాగృతి మీటింగ్ లో కవిత వచ్చేటప్పుడు సీఎం సీఎం అనే నినాదాలు ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోనీ కవితే సీఎం అభ్యర్థి అనుకుంటే, మరి కేసీఆర్ ఏంకావాలని మరికొంతమంది లాజిక్ తీస్తున్నారు. అటు కేటీఆర్ ఏమో.. కేసీఆరే మన నెక్స్ట్ సీఎం అంటున్నారు. ఇంతకీ ఆ ఫ్యామిలీలో ఎంతమంది సీఎం అభ్యర్థులు ఉంటారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ ఏంటో తెలియదు కానీ, సీఎం సీటుకి అప్పుడే పోటీ మొదలైందంటూ కౌంటర్లు పడుతున్నాయి. ముందు ఇంటి రాజకీయాలు చక్కబెట్టుకోవాలంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.
ఫ్యామిలీ పాలిటిక్స్..
పరిస్థితులు అనుకూలిస్తే రెండో దఫా అధికారం ముగిసేలోపు కేసీఆర్, కేటీఆర్ ని సీఎం చేస్తారని అనుకున్నారంతా. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆరే సీఎం అనే ప్రచారం జరిగింది. కానీ బీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది, ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో సున్నా సీట్లతో మరింత దారుణ పరాభవం మూటగట్టుకుంది. ఆ తర్వాత కేటీఆర్ కి జ్ఞానోదయం అయింది. కేసీఆరే మన నెక్స్ట్ సీఎం అంటూ ఆయన పదే పదే చెప్పడానికి కారణం అదే. కేసీఆర్ ముందు వరుసలో ఉంటేనే బీఆర్ఎస్ కి కాస్తో కూస్తో ప్రజాదరణ ఉంటుంది, ఆయన్ని వెనక్కి నెట్టి కేటీఆర్ ముందుకొస్తే అంతే సంగతులు. హరీష్ వర్గం అప్పుడే పక్కకు వెళ్తుంది, మిగతా నాయకులు కూడా తలోదారి చూసుకుంటారు. అందుకే కేటీఆర్ తండ్రి పేరుని వాడుకోవాలని చూస్తున్నారు. కానీ ఆయనకు చెల్లెలి రూపంలో శత్రువు తయారైంది. కవిత రాజకీయం, కేటీఆర్ ని మరింత అభద్రతా భావంలోకి నెట్టేస్తోంది.
మన నాయకుడు కేసీఆర్, మన బాస్ కేసీఆర్ అంటూ కవిత కూడా గతంలో పదే పదే ప్రస్తావించేవారు. అయితే ఇప్పుడామె రూటు మార్చినట్టు తెలుస్తోంది. సీఎం సీఎం అంటూ తనని పొగిడేస్తున్న అభిమానులను ఆమె ఎందుకు వారించలేదు? మనం అధికారంలోకి వస్తే సీఎం అయ్యేది కేసీఆరేనని ఆమె ఎందుకు చెప్పడం లేదు? అంటే కవిత మనసులో ఏదో ఉంది. బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగానే ఆమె జాగృతిని తెరపైకి తెస్తున్నారు. జాగృతి రాజకీయాలతో బీఆర్ఎస్ కి కానీ కేసీఆర్ ఫ్యామిలీకి కానీ సంబంధాలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సీఎం సీఎం అనే నినాదాలను ఆమె ఆస్వాదించారు. కవిత రాజకీయం ఎలా ఉన్నా.. కేసీఆర్ కుటుంబం మాత్రం ప్రజల్లో మరింత పలుచన అవుతోందని అంటున్నారు నెటిజన్లు.