Jagityala News: కడుపు ఆకలిని తట్టుకోగలిగాడు కానీ.. కన్నతల్లి కాలి నొప్పిని చూడలేకపోయాడు ఓ కుమారుడు. తల్లిపై అపారమైన ప్రేమను, మానవత్వాన్ని చాటుకున్న ఈ హృదయ విదారక దృశ్యం జగిత్యాల పట్టణంలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి చికిత్స అందించేందుకు నిజామాబాద్ జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన దీపక్ తన తల్లిని తీసుకుని జగిత్యాలకు వచ్చాడు. జేబులో పైసా లేకపోయినా.. తన ప్రేమను పెట్టుబడిగా భావించాడు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉండటంతో తల్లిని బస్టాండ్ వరకు తీసుకొచ్చాడు.
ఆటో ఛార్జీ కోసం అడ్డంకి.. కుమారుడి సాహసం
అయితే, అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లడానికి ఆటో డ్రైవర్ 50 రూపాయలు అడగగానే దీపక్ గుండె తరుక్కుపోయింది. జేబులో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో పడ్డాడు. తల్లి నొప్పితో విలవిలలాడుతుంటే చూసి తట్టుకోలేకపోయాడు. ఏమీ ఆలోచించకుండా.. తల్లిని భుజాన వేసుకుని ఆస్పత్రి దిశగా నడవసాగాడు. కన్నతల్లిని తన భుజాన మోస్తూ ఆ కుమారుడు చూపిన అపారమైన ప్రేమ, ఆత్మబంధానికి ప్రతీకగా నిలిచింది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా మౌనంగా ఉండిపోయార., వారి హృదయాలు కరిగిపోయాయి. డబ్బు లేకపోయినాజజ కన్నతల్లిని ఎలాగైనా ఆస్పత్రికి చేర్చాలన్న ఆ కుమారుడి తపన అక్కడున్న ప్రతి ఒక్కరి కంట కన్నీరు పెట్టించింది.
కదిలిపోయిన ఎమ్మెల్యే.. కారులో ఆస్పత్రికి తరలింపు
సరిగ్గా అదే సమయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అటువైపుగా వెళ్తున్నారు. తల్లిని భుజాన వేసుకుని ఆస్పత్రికి నడుస్తున్న దీపక్‌ను చూసి ఆయన చలించిపోయారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా, వెంటనే తన కారు ఆపి వారి వద్దకు చేరుకున్నారు. మానవతా దృక్పథంతో వారి పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వారిని తన కారులోనే ఆస్పత్రికి తరలించారు. తల్లికి మెరుగైన చికిత్స అందేలా అన్ని ఏర్పాట్లు చేయించారు. చికిత్స పూర్తయిన తర్వాత తిరిగి వారిని బస్టాండ్ వద్దకు సురక్షితంగా చేర్చారు.
మానవత్వానికి కొత్త నిర్వచనం
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చూపిన ఔదార్యం, తల్లిపై దీపక్ చూపిన అనిర్వచనీయమైన ప్రేమ జగిత్యాలలో ఆ రోజు మానవత్వానికి నూతన నిర్వచనం ఇచ్చాయి. ఒక పేద కుమారుడు కడుపు ఆకలిని తట్టుకున్నా.. తల్లి బాధను భరించలేక తన ప్రేమను చూపాడు. అధికారంలో ఉన్న వ్యక్తి ఆ ప్రేమకు చేయూతనిచ్చి.. బాధ్యతను నెరవేర్చారు. ఈ సంఘటన మాతృప్రేమ గొప్పదనాన్ని.. ఒక పాలకుడి ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచింది. తల్లిదండ్రులు, వారి సంతానం మధ్య బంధం ఎంత బలమైందో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.
ALSO READ: TGSRTC: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పులేదని ప్రాథమిక నిర్ధారణ