TGSRTC: చేవెళ్ల సమీపంలోని ఇందిరా రెడ్డి నగర్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై టి.జి.ఎస్.ఆర్టీసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మంది గాయపడ్డారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం టిప్పర్ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తేలిందని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది.
ఈ ఘటనపై ఆర్టీసీ ప్రాథమిక విచారణ పూర్తి చేసింది. ప్రమాదానికి బస్సు గానీ, డ్రైవర్ గానీ కారణం కాదని తేలింది. బస్సు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని, డ్రైవర్‌కు ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేదని సంస్థ తెలిపింది. రోడ్డు మలుపు వద్ద టిప్పర్ డ్రైవర్ అతి వేగం కారణంగా నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు ఆర్టీసీ పేర్కొంది.
తాండూరు నుంచి ఉదయం 4.40 గంటలకు బయలుదేరిన ప్రైవేట్ హైర్ ఎక్స్‌ప్రెస్ బస్సు (TS 34TA 6354), ఇందిరానగర్ వద్దకు రాగానే ఎదురుగా కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్ (TG06T 3879) బలంగా ఢీకొట్టింది. టిప్పర్ అతి వేగంగా ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం, ఎడమవైపు భాగం పూర్తిగా ధ్వంసమయ్యాయి. అనంతరం టిప్పర్ బస్సుపైకి ఒరిగిపోవడంతో, అందులోని కంకర ప్రయాణికులపై పడింది. దీంతో బస్సు డ్రైవర్ దస్తగిరితో సహా చాలా మంది ప్రయాణికులు ఊపిరాడక మరణించారు. మృతుల్లో 5 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు.
Read Also: Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ప్రమాదం ఎలా జరిగింది..? బాధితులు ఏమంటున్నారంటే?
క్షతగాత్రులను హుటాహుటిన చేవెళ్ల, వికారాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించారు. టి.జి.ఎస్.ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి సహా ఉన్నతాధికారులు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు, టి.జి.ఎస్.ఆర్టీసీ నుంచి రూ. 2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గాయపడిన వారికి ప్రభుత్వం రూ. 2 లక్షలు అందిస్తుంది. అదనంగా, వాహన ఇన్సూరెన్స్ ద్వారా కూడా పరిహారం చెల్లించనున్నారు.