August 2025 bank holidays: ఆగస్ట్ అంటే పండుగల మాసం. స్వాతంత్ర్య దినోత్సవం, కృష్ణాష్టమి, వినాయక చవితి… ఇలా వరుస పండుగలు వస్తాయి. అందుకే ఈ నెలలో బ్యాంకులకు ఎక్కువ రోజుల సెలవులు ఉన్నాయ్. ఎప్పటిలానే ఆదివారాలు, రెండో, నాల్గవ శనివారాలు బ్యాంకులు మూసే రోజులు. అలాగే కొన్ని ప్రత్యేక పండుగల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో స్థానిక సెలవులూ ఉంటాయి.
ఈ ఆగస్టులో మొత్తం 15 రోజులు బ్యాంకులు మూసివుంటాయి. ఈ సెలవుల్లో చాలావరకు ఆదివారాలు, శనివారాలే అయినా, కొన్ని ముఖ్యమైన జాతీయ, ప్రాంతీయ పండుగల కారణంగా మధ్యవారం రోజుల్లో కూడా బ్యాంకులు పని చేయవు. అందుకే బ్యాంకుకు వెళ్లే ముందు సెలవుల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిది.
ఆగస్టు 3వ తేదీ ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివుంటాయి. ఆ తర్వాత ఆగస్టు 8న శుక్రవారం, సిక్కింలోని గ్యాంగ్‌టక్ ప్రాంతంలో ‘టెండాంగ్ లో రుమ్ ఫెస్టివల్’ సందర్భంగా బ్యాంకులు సెలవుగా ఉంటాయి.
ఆగస్టు 9న శనివారం రక్షా బంధన్ పౌర్ణమి సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివుంటాయి. అలాగే ఇది రెండవ శనివారం కావడం వల్ల దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవే.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, షహెన్షాహి వేడుక, కృష్ణ జన్మాష్టమి మూడు కలిసి వచ్చాయి. అందుకే ఆ రోజు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివుంటాయి. ఆ తర్వాతి రోజైన ఆగస్టు 16న కూడా కృష్ణాష్టమి సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివుంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ జన్మాష్టమి ఆ రోజు జరుపుకుంటారు కాబట్టి బ్యాంకులకు సెలవే.
మణిపూర్‌లో మాత్రం ఆగస్టు 13న ప్యాట్రియట్ డే సెలవు ఉంటుంది. త్రిపురాలో ఆగస్టు 19న మహారాజా బిక్రమ్ కిషోర్ బహదూర్ పుట్టినరోజు సందర్భంగా బ్యాంకులు మూసివుంటాయి. అలాగే ఆగస్టు 23న నాల్గవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసే రోజే. ఆగస్టు 25న అస్సాంలో శంకర్ దేవ్ జయంతి సందర్భంగా స్థానిక బ్యాంకులకు సెలవు ఉంటుంది.
Also Read: Vande Bharat Sleeper first look: వందే భారత్ స్లీపర్.. ఫస్ట్ లుక్ అవుట్.. చూస్తే వావ్ అనేస్తారు!
ఆగస్టు 27న గణేష్ చతుర్థి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, గోవా వంటి రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివుంటాయి. అదే పండుగ ఆగస్టు 28న కూడా కొన్ని రాష్ట్రాల్లో ఒరిస్సా, గోవా రాష్ట్రాలలో జరుపుకుంటారు కాబట్టి అక్కడ మళ్లీ సెలవు ఉంటుంది. ఆఖరులో ఆగస్టు 31 ఆదివారం కావడంతో మళ్లీ దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవే.
మరి బ్యాంకులు మూసివున్నా, డిజిటల్ బ్యాంకింగ్ పని చేస్తుందా?
అవును.. మీరు బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లలేకపోయినా, ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్‌లు ఎప్పట్లాగే పనిచేస్తుంటాయి. డబ్బు విత్‌డ్రా కోసం ఏటీఎంలు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగని, చాలా అవసరమైన పనులు ఉంటే సెలవు తేదీల్లో బ్యాంకు వెళ్లకుండానే ముందుగానే చూసేయడం బెటర్. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆగస్టు నెలలో బ్యాంకుకు వెళ్లే ముందు ఒక్కసారి సెలవుల జాబితా చూసుకోవడం మంచిదే. పండుగల మధ్యలో పనులు నిలిచిపోకుండా చూసుకోవాలంటే ముందు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది.