KCR : మోదీపై ఫైర్
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్యేలను కొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. పండిన పంటను కొనరు కానీ ఎమ్మెల్యేలను కొంటారని మండిపడ్డారు. మోదీ విశ్వ గురువు కాదని, విష గురువని ఘాటు విమర్శలు చేశారు. దేశాన్ని పాలించే అవకాశం ఇచ్చినా… రాష్ట్రాల్లో కుట్రలు ఎందుకని ప్రశ్నించారు. ప్రజలు మోదీని రెండుసార్లు ప్రధానిని చేసినా రాష్ట్ర ప్రభుత్వాలను ఎందుకు కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని నిలదీశారు. దేశంలో ఏ ప్రధాని చేయని దారుణాలు మోదీ చేశారని ఆరోపించారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ వేసి వారి నడ్డి విరిచారని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రానికి బుద్ధిరావాలంటే చేనేత కుటుంబాలు బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దని సూచించారు. మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
విద్యుత్ మీటర్లపై
కేంద్రం చేపట్టిన విద్యుత్ సంస్కరణలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులపై కేంద్రం పెద్ద కుట్ర చేస్తోందన్నారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని తెలిపారు. కానీ తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలో కూడా 24 గంటలు విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. విద్యుత్ సంస్కరణల ముసుగులో వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. ఇళ్లలోనూ మీటర్లు మార్చాలని మోదీ చూస్తున్నారని వెల్లడించారు. రూ.30 వేలు చెల్లించి ఇంట్లో మీటరు మార్చుకోవాలని మోదీ ఆదేశాలు జారీ చేశారని కేసీఆర్ చెప్పారు. మీటర్లు పెట్టుకుని కొంపలు ఆర్పుకొందామా? మీటర్లు పెడదామనుకున్న వారికి మీటరు పెడదామా? అని ప్రశ్నించారు. బీజేపీకి ఓటేస్తే విద్యుత్ చట్టాలను అంగీకరించినట్టేనని స్పష్టం చేశారు. బీజేపీకి డిపాజిట్ వచ్చినా తనను పక్కకు నెట్టేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. 60 ఏళ్ల కింద చిన్న పొరపాటు జరిగితే 58 ఏళ్లపాటు కొట్లాడామని చివరికి తాను చావు నోట్లో తలపెట్టి కొట్లాడితే తప్ప తెలంగాణ రాలేదన్నారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయకపోతే .. పెట్టుబడి దారులను మనమే ప్రోత్సహించినట్లవుతుందని ప్రజలను కేసీఆర్ హెచ్చరించారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని అనుకూలమైన భూమి భారత్‌కు ఉందని.. అందుకే వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని కేసీఆర్ ఆరోపించారు.
బీఆర్ఎస్ కు పునాది
దేశ రాజకీయాలను మలుపుతిప్పే సువర్ణావకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ మాదిరిగానే భారత్‌ను అభివృద్ధి చేయడానికి పుట్టుకొచ్చిందే బీఆర్‌ఎస్ అని తెలిపారు. నాడు టీఆర్ఎస్ కు సిద్ధిపేటలో పునాది పడితే.. నేడు మునుగోడులో బీఆర్ఎస్ కు పునాది వేయాలన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మునుగోడును కడుపులో పెట్టుకుంటానన్నారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత తీసుకుంటానని హామీఇచ్చారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు మోదీకి ఎనిమిదేళ్లు సరిపోలేదా? ప్రశ్నించారు. రూపాయి పతనానికి కారణం ఎవరు? అని నిలదీశారు. గ్యాస్,పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరిగాయన్నారు. ధరల పెరుగుదలపై పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ప్రైవేటీకరణ జరిగితే దారుణ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
వాస్తవాలు బయటకొస్తాయి
ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ఇప్పటివరకు జన చూసిందని కొంతేనని ఇంకా చాలా ఉందని వెల్లడించారు. రాజ్యాంగబద్ధమైన సీఎం పదవిలో ఉన్నందున ఎక్కువ చెప్పలేకపోతున్నానని తెలిపారు. విచారణను ప్రభావితం చేసినట్లు అవుతుందని పూర్తిగా చెప్పట్లేదన్నారు. మతోన్మాదులు, పెట్టుబడుదారి తొత్తులు, ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూలదోసే వారిని తన్ని తరిమేయాలని ప్రజలను కోరారు. తెలంగాణ పచ్చబడితే ఓర్వలేకపోతున్నారని, రాష్ట్రంలో ఫ్లోరైడ్ ను పారద్రోలింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. తాను బతికున్నంత కాలం రైతు బంధు పథకం ఆగదన్నారు.
బండి సంజయ్ కు కౌంటర్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విసిరిన సవాల్ పై కేసీఆర్ స్పందించారు. తల మాసినోడు తడి బట్టలతో ప్రమాణం చేయమంటే తాను చేయాలా? అని నిలదీశారు. మంత్రి జగదీష్ రెడ్డి వ్యవహారంపై కేసీఆర్ ఈసీ తీరును తప్పుపట్టారు. జగదీష్ రెడ్డి ఏ తప్పు చేశారని ఈసీ చర్యలు తీసుకుందని ప్రశ్నించారు.