Rahul Gandhi : రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఐదోరోజు ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం జడ్చర్లలో ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రం షాద్‌నగర్‌లో ముగిసింది. షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ధరణి పోర్టల్‌ను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు లాక్కున్న భూములను తిరిగి పేదలకే అప్పగిస్తామని స్పష్టం చేశారు. నల్లచట్టాలతో పాటు పార్లమెంట్ బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడు కలిసి డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. మోదీ పాలన వల్ల దేశంలో అన్ని రంగాలు నష్టపోయాయని తెలిపారు. పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, చిన్న వ్యాపారులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదన్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా కాశ్మీర్ వరకు యాత్ర చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్ షాద్ నగర్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు.