Big Stories

KCR: కేసీఆర్ లెక్కలివేనా?.. చేసింది చెప్పుకుంటే చాలా?

cm kcr

CM KCR News Update(Political News in Telangana) : చేసింది చెప్పుకుంటే చాలు అంటున్న కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికల కోసం ప్రత్యేక స్కెచ్ తో కనిపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీని తట్టుకోవడం ఒక ఎత్తు అయితే.. వరుసగా రెండు టర్మ్ లు బీఆర్ఎస్ ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునే ప్లాన్లలో ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న వర్గాలకు ఇప్పుడిప్పుడే ఉపశమనం కలిగించేలా సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోంది.

ఇది ఎన్నికల ఏడాది. ఏయే వర్గాన్ని దగ్గరికి తీయాలో కేసీఆర్ కు బాగా తెలుసు. ఇన్నాళ్లూ కేసీఆర్ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారిని కూల్ చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా చూసుకోవడం.. మెజార్టీ వర్గాలకు మేలు చేస్తున్నామన్న భావన జనంలో కల్పించేందుకు కేసీఆర్ ఇప్పటినుంచే కసరత్తు మొదలు పెట్టారు. అందులో భాగంగానే పంచాయతీల పెండింగ్ బిల్లుల రిలీజ్, పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్, గొర్రెల పంపిణీ, పోడు పట్టాల పంపిణీ, పెండింగ్ హామీలపై ఫోకస్ అంటున్నారు.

మరోవైపు అభివృద్ధి పనులపై ప్రచారం చేస్తూనే.. ఇంకోవైపు పొలిటికల్ గానూ కేసీఆర్ అలర్ట్ అవుతున్నారు. కేసీఆర్ గత రెండు ఎన్నికల సమయంలో స్ట్రాటజీని చూస్తే ఇప్పుడు మూడోసారి ఆయన వ్యూహాలను అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. 2018లో ఇప్పుడు సిట్టింగ్ లకే మళ్లీ సీట్లు అంటూ ఎమ్మెల్యేలందరినీ సెట్ రైట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు. కర్ణాటకలో బీజేపీపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కాంగ్రెస్ పార్టీకి మళ్లింది. ఇక్కడ కూడా వ్యతిరేక ఓటు గుంపగుత్తగా ఏ పార్టీకి పడుతుందన్న టెన్షన్ లో గులాబీదళం ఉంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక పార్టీకే వెళ్తే ఇబ్బందులు తప్పవని గ్రహించిన గులాబీ బాస్.. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో BRS తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉందని.. పట్టణ ప్రాంతాల్లో బిఆర్ఎస్ తర్వాత బీజేపీకి ప్రజల్లో ఆదరణ ఉందని బిఆర్ఎస్ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో 30 నుంచి 35 శాతం వరకు ఓటు బ్యాంకు ఉందని అది ఎన్నికల నాటికి మరో 2 శాతం పెరిగినా తమకు ఇబ్బంది లేదని గులాబీ పార్టీ అంచనా వేసుకుంటోంది. అయితే ఓట్ల చీలికలో కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు పార్టీలు సమానంగా చీల్చితే.. తమకు ఏ బాధ ఉండదనుకుంటున్నారు. కానీ ఓటర్లు వన్ సైడ్ ఆలోచిస్తే మాత్రం బీఆర్ఎస్ కు కష్టాలు తప్పవన్న విశ్లేషణ ఉంది.

మరోవైపు ఎమ్మెల్యేలపై ఎప్పటికప్పుడు నజర్ పెంచుతున్నారు. ఎన్నికల టైం కావడంతో వారి కదలికలపై ఫోకస్ పెంచుతున్నారు. అంతే కాదు… ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏం చేసినా ఏ స్టెప్ తీసుకున్నా తనకు తెలుస్తుందంటూ కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఎన్నికల టైంలో నేతలు పార్టీలు మారడం కామన్. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉంటున్న వారు టిక్కెట్ రాదన్న అభద్రతా భావం ఉంటే కచ్చితంగా వేరే పార్టీ చూసుకుంటారు. అలాంటి వారు ఎక్కడ ఎవరితో చర్చలు జరిపినా తనకు తెలిసిపోతుందని చెప్పడం ద్వారా పూర్తిస్థాయి నియంత్రణకు ప్లాన్ గానే చూడాలంటున్నారు.

ఇవి కూడా చదవండి

Latest News