Ugreen 67W Charger: ఎక్కడికైనా ఊరు వెళ్లాలంటే చాలు.. మన లగేజీలో ముందుగా సర్దేది మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల చార్జర్లు. అయితే ప్రతిసారీ ఒక్కో డివైజ్‌కి ఒక్కో ఛార్జర్ పట్టుకెళ్లడం పెద్ద తలనొప్పిగా అనిపిస్తుంటుంది. పైగా వేరే దేశాలకు వెళ్తే అక్కడి ప్లగ్‌లు మన ఛార్జర్లకు సెట్ కావు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా ప్రముఖ టెక్ కంపెనీ యూగ్రీన్ (Ugreen) ఒక అద్భుతమైన ఛార్జర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. చూడటానికి చిన్నగా ఉన్నా, దీని పనితీరులో మాత్రం అదిరిపోతుంది. తరచూ ప్రయాణాలు చేసేవారికి ఇది నిజంగా ఒక సూపర్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు.
ఈ సరికొత్త ట్రావెల్ ఛార్జర్ మెయిన్ హైలైట్ ఏంటంటే.. దీనికి వేర్వేరు దేశాల్లో వాడే ప్లగ్స్ అన్నీ ఈ ఛార్జర్ బాడీలోనే ఫిట్ చేసి ఉంటాయి. అమెరికా, బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా.. ఇలా ఏ దేశానికెళ్లినా సెపరేట్ అడాప్టర్లు లేదా కన్వర్టర్లు అవసరం లేకుండా నేరుగా గోడలోని సాకెట్‌కు పెట్టేయొచ్చు. 100V నుంచి 240V వరకు పవర్ ఇన్‌పుట్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే దీన్ని ఎయిర్‌పైరా 2.0 టెక్నాలజీతో చాలా కాంపాక్ట్‌గా డిజైన్ చేశారు. చిన్న పాకెట్ టిష్యూ ప్యాకెట్ సైజులో ఉండే ఈ ఛార్జర్ బరువు కేవలం 166 గ్రాములు మాత్రమే. బ్యాగ్‌లో వేసుకుంటే అసలు బరువే అనిపించదు.
ఈ చిన్న ఛార్జర్ లోపల పవర్‌ఫుల్ హార్డ్‌వేర్ ఉంది. దీనిలో మొత్తం 3 పోర్ట్స్ ఉంటాయి. రెండు టైప్-సీ పోర్ట్స్, ఒక యూఎస్‌బీ-ఏ పోర్ట్ ఇచ్చారు. ఏ ఒక్క టైప్-సీ పోర్ట్‌ను వాడినా ఏకంగా 67 వాట్ల ఫాస్ట్ పవర్ బయటికి వస్తుంది. దీనివల్ల మార్కెట్లో దొరికే ఏ థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్ అయినా.. యాపిల్ లేదా షావోమి ఫోన్లు, ట్యాబ్లెట్లు నిమిషాల్లో ఛార్జ్ అయిపోతాయి. ఇక చిన్నపాటి గ్యాడ్జెట్లు లేదా ఇయర్‌బడ్స్ ఛార్జ్ చేసుకోవడానికి యూఎస్‌బీ-ఏ పోర్ట్ ఉంటుంది. ఒకేసారి మూడు డివైజ్‌లు పెట్టినా పవర్ షేర్ అవుతుంది కానీ, టోటల్ పవర్ 67 వాట్లే వస్తుంది.
సాధారణ ఛార్జర్లలో లైట్ మినహా ఏం కనపడదు. కానీ ఇందులో మాత్రం రియల్ టైమ్ ఛార్జింగ్ సమాచారాన్ని చూపించే ఒక చిన్న స్క్రీన్ ఇచ్చారు. ఛార్జింగ్ ఎంత స్పీడ్‌గా ఎక్కుతోంది, కరెంట్ ఎంత, ఏ ప్రోటోకాల్ పనిచేస్తోందనే విషయాలు క్లియర్‌గా కనిపిస్తాయి. అంతేకాదు.. ఫోన్ ఛార్జ్ అయ్యేటప్పుడు వేడెక్కకుండా చూసేందుకు ఇందులో ఇంటెలిజెంట్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఒకవేళ టెంపరేచర్ ఎక్కువైతే స్క్రీన్ మీద సేఫ్టీ మోడ్ ఆన్ అయినట్టు చూపిస్తుంది. బటన్‌ను రెండు సెకన్లు నొక్కితే పీపీఎస్ ప్రయారిటీ మోడ్‌ను కూడా ఆన్ చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి ఈ ట్రావెల్ ఛార్జర్ చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. అక్కడ దీని ప్రీ-ఆర్డర్ ధర సుమారు 189 యువాన్లు అంటే.. మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.2,250 వరకు ఉంటుంది. దీనికి కంపెనీ 18 నెలల వారంటీ కూడా ఇస్తోంది. త్వరలోనే ఇతర దేశాల మార్కెట్లలోకి కూడా దీన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది గనుక మన దేశానికి వస్తే మాత్రం ట్రావెలర్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.