Warangal Politics: ఓరుగల్లు రాజకీయాలు కొత్త ఈక్వేషన్స్ నడుస్తున్నాయా? పాత మిత్రులు అంతా ఒక్కటిగా కట్టి పొలిటికల్ డామినేషన్ చూపిస్తున్నారా? వారందరినీ కలిపింది పసుపు రంగు జెండాయేనా? అవుననే అంటున్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య. ఇంతకీ రాజయ్య చెప్తున్న ఈక్వేషన్స్ ఏంటి? కామెంట్స్ వెనుకున్న కారణాలేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
వేడెక్కిన ఓరుగల్లు రాజకీయాలు
మంత్రి కొండా సురేఖ పొలిటికల్ కాంట్రవర్సీలు సీరియల్ మాదిరి ఎపిసోడ్ లను తలపిస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో వైరం, భద్రకాళి ఆలయ ధర్మకర్తల నియామకంపై అసమ్మతి ఇంకా చల్లారలేదు. సీన్లోకి మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఎంట్రీ ఇచ్చేశారు. ఆపై సొంత పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. జరిగిన పరిణామాలతో కొండ ఫ్యామిలీకి సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేకత తీవ్రమైంది.
మేడారం అభివృద్ధి పనుల టెండర్ల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ-పొంగులేటికి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ఇక్కడితో ఆ వ్యవహారం ముగియలేదు. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా పని చేసిన సుమంత్ వ్యవహారం తెరపైకి వచ్చింది. అవినీతి అక్రమాల ఆరోపణలతో ప్రభుత్వం అతడ్ని టెర్మినేట్ చేసింది. ఈ సమయంలో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లోకి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు ఆమె కూతురు సుస్మిత.
రాజయ్య వ్యాఖ్యల వెనుక మేటరేంటి?
ఆమె ఓ వర్గం మంత్రులను టార్గెట్ చేస్తూ సీఎం పేరును లాగేశారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సహచర మంత్రులు ఎపిసోడ్ చివరికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు చేరింది. మంత్రి కొండా సురేఖ వ్యవహారం పార్టీలో ప్రకంపనలు రేగడంతో డ్యామేజ్ కంట్రోల్ చేసింది అధిష్టానం. పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడొద్దని కొండా ఫ్యామిలీకి సూచనలు చేశారట టీపీసీసీ పెద్దలు.
ఇంతటితో కొండా సురేఖ ఎపిసోడ్‌కి ఫుల్‌స్టాప్ పడిందని భావించారు. మంత్రి సురేఖ వెనుక భారీ కుట్ర జరిగిందని, కొంతమంది నాయకులు కావాలనే ఆమె లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు
మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ టీడీపీ నేతలంతా ఏకమయ్యారని, వాళ్లంతా మంత్రి కొండా సురేఖను టార్గెట్ చేశారని ఆరోపించారు.
ALSO READ: జూబ్లీహిల్స్ బైపోల్.. నేతల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఈ కుట్ర జరుగుతుందని ఆయన చెబుతున్నమాట. తన రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడితే ఉపఎన్నిక వస్తుందని భావిస్తున్నారు రాజయ్య. అనర్హత అంశం స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉంది. బైపోల్ అంశాన్ని ఘనపూర్ నియోజకవర్గ ఓటర్లు పట్టించుకోలేదు. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు మాజీ ఎమ్మెల్యే.
మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగావున్న నేతల పేర్లను ప్రస్తావించి, కడియం శ్రీహరిని ప్రధాన కారకుడిగా ముద్ర వేసే ప్రయత్నం చేశారట రాజయ్య. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్న ఫార్ములాను అప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారట రాజయ్య. కొండా సురేఖతో కడియం శ్రీహరికి చెక్ పెట్టేలా చూసేందుకు ఓ ప్రయత్నం చేశారట మాజీ డిప్యూటీ సీఎం.
రాజయ్య వ్యాఖ్యలు సరైనవేనని అకొండా ఫ్యామిలీ అనుచరుల్లో ఓవర్గం భావిస్తుందట. కొండా సురేఖతో పంచాయతీ పెట్టుకుంటున్న నేతలంతా గతంలో టీడీపీ నుండి వచ్చినవారేనని రాజయ్య చేసిన వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుతోందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ హయంలో ఉపముఖ్యమంత్రి పదవిని కడియం శ్రీహరికి కట్టబెట్టడంతో గుర్రుగా ఉన్నారు రాజయ్య.
ఆనాటి నుంచి సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా కడియంను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కొండా సురేఖ ఎపిసోడ్‌ను తనకు అనుకూలంగా మలుచుకుని కడియం శ్రీహరిని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కొంతమంది భావిస్తున్నారట. మొత్తానికి రానున్న రోజుల్లో ఓరుగల్లు రాజకీయాలు ఎటువైపు తిరుగుతాయో చూడాలి.