Megha Job Mela: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కల్పనకు మరో ముందడుగు వేసింది. హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 25న జరగబోయే మేఘా జాబ్ మేళా ద్వారా వేలాది మంది యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
హుజుర్నగర్ విజ్ఞాన్ పాఠశాల, స్వర్ణవేదిక ఫంక్షన్ హాల్ లలో జరగనున్న ఈ జాబ్ మేళాలో.. 200 పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఇప్పటివరకు 205 కంపెనీలు రిజిస్టర్ చేసుకోగా, 9,500 పైగా నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మరింతమంది కంపెనీలు, అభ్యర్థులు కూడా చేరే అవకాశముందని మంత్రి తెలిపారు.
నా రాజకీయ జీవితంలో ఎదురైన అతిపెద్ద సమస్య నిరుద్యోగతే. ఈ సమస్యను పరిష్కరించేందుకు నేను వ్యక్తిగతంగా కృషి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 70 నుండి 75 వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేసింది. గ్రూప్–1, గ్రూప్–2 నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేశాం అని చెప్పారు.
అలాగే, లైసెన్స్డ్ సర్వేయర్ నియామకాలు కూడా త్వరలో జరగనున్నాయని తెలిపారు. నిరుద్యోగ నిర్మూలన పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ జాబ్ మేళా దానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మేఘా జాబ్ మేళాలో పాల్గొనడానికి ఇప్పటికే.. ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయి. విశాఖ అస్బెస్టాస్, అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అనేక పరిశ్రమలు ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడ్డాయి. ఈ సంస్థల ప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొని తమ సంస్థల్లో ఖాళీలను నింపేందుకు సిద్ధమయ్యారు.
ఉత్తమ్ మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగత అధికంగా ఉంది. అందుకే ఈ జాబ్ మేళా ద్వారా గ్రామీణ యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం. వారి ప్రతిభను గుర్తించి సరైన వేదిక ఇవ్వడం లక్ష్యం అని తెలిపారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా భావించి, ప్రతి గ్రామం నుంచి యువతను పాల్గొనడానికి ప్రోత్సహించాలి,” అని సూచించారు.
నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని వదులుకోకూడదని మంత్రి స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఇప్పుడు వారి కళ్లలో వెలుగులు నింపే సమయం ఇది. జాబ్ మేళాలో పాల్గొని తమ అర్హతలకు తగిన ఉద్యోగాన్ని సాధించాలి అని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: సౌత్ ఆఫ్రికాలో తెలంగాణ వాసి అనుమానాస్పద మృతి
ఈ జాబ్ మేళా ఏర్పాట్లను మంత్రి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఆయనతో పాటు శాసన మండలి సభ్యుడు శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్‌పీ నరసింహ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.