జగన్, కేసీఆర్ మంచి ఆత్మీయులు. కేసీఆర్ కి వైఎస్ఆర్ కి మధ్య స్నేహం లేకపోయినా.. ఉమ్మడి శత్రువు చంద్రబాబు వల్ల జగన్, కేసీఆర్ కి స్నేహం కుదిరింది. అయితే వీరిద్దరి మధ్య చాలా పోలికలున్నాయి. ఓటమిని అస్సలు ఒప్పుకోరు. ఒప్పుకోరంటే కిందపడ్డా మాదే పైచేయి అనే రకం. 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కూడా జగన్ ఎక్కడికి వెళ్లినా సీఎం సీఎం అని నినాదాలు వినపడితే సంతోషిస్తూ కనపడతారు. నినాదాలు కాదురా బాబూ, పోలింగ్ రోజు ఎక్కడికెళ్లారని ఒక్కర్ని అయినా అడిగేవారు కాదు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకోసం బీఆర్ఎస్ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో కేసీఆర్ పేరు పక్కన ఆయన డిజిగ్నేషన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అని కాకుండా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని వేసుకున్నారు. ఈయన కూడా సీఎంగా దిగిపోయినా సీఎం సీఎం అని ఎవరైనా అంటుంటే సంతోషిస్తారని తెలుస్తోంది. ఇవే కాదు వీరిద్దరి మధ్య ఇంకా చాలా పోలికలున్నాయి.
ఓవర్ కాన్ఫిడెన్స్..
ఓవర్ కాన్ఫిడెన్స్ విషయంలో జగన్, కేసీఆర్ ఇద్దరూ పోటీ పడతారని అంటుంటారు నెటిజన్లు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి కేసీఆర్ లో ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. వరుసగా రెండుసార్లు సీఎం అయ్యే సరికి, హ్యాట్రిక్ సీఎం అని ముందుగానే పిలిపించుకున్నారు. దక్షిణాదిలో హ్యాట్రిక్ సీఎం అవుతున్న అరుదైన నాయకుల్లో కేసీఆర్ పేరు కూడా ఉంటుందని అప్పటి బీఆర్ఎస్ నేత, ఇప్పటి బీఆర్ఎస్ బహిష్కృత జాగృతి నేత కవిత అనేవారు. ఇక కేసీఆర్, కేటీఆర్ అయితే గెలుపు విషయంలో ఎక్కడలేని ధీమాతో కనిపించేవారు. ఆ ధీమాతోనే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ఎవ్వరి మాటా వినలేదు, చివరకు ఫలితం తేడా కొట్టింది. తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చేస్తున్నామనే నమ్మకంతోనే ఆయన టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీ అన్నారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని, ఇక్కడ తన తనయుడు కేటీఆర్ ని సీఎం చేయాలని ఆయన అనుకునేవారని సన్నిహితుల సమాచారం. చివరకు తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోవడంతో బీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్ గా మార్చాలనే డిమాండ్లు కూడా వినిపించాయి.
జగన్ కూడా అదే టైప్..
ఓవర్ కాన్ఫిడెన్స్ విషయంలో కేసీఆర్ కంటే జగన్ రెండు అడుగులు ముందున్నారని చెప్పుకోవాలి. వైనాట్ 175 అనే నినాదం ఒక్కటి చాలు, జగన్ ఏ రేంజ్ లో తన విజయంపై నమ్మకం పెట్టుకున్నారో చెప్పడానికి. వైనాట్ కుప్పం, వైనాట్ పిఠాపురం, వైనాట్ మంగళగిరి అంటూ జగన్, కేసీఆర్ కంటే ఎక్కువగా గెలుపుపై ధీమా పెట్టుకున్నారు. చివరకు 11 సీట్లతో ఘోర పరాభవం ఎదురవడంతో ఆ నెపం ఈవీఎంలపైకి నెట్టేసి, తప్పు తనది కాదు మిషనరీది అని అన్నారు.
తప్పెవరు చేశారు?
కేసీఆర్, జగన్.. ఇద్దరూ ప్రజల్ని తక్కువగా అంచనా వేశారనేది ఎక్కువమంది అభిప్రాయం. అయితే వారు ప్రజలే తప్పు చేశారని తీర్మానించడం ఇక్కడ మరో విశేషం. ప్రజలు కేసీఆర్ ని ఓడించి బాధపడుతున్నారని, తిరిగి ఆయన్ను సీఎంగా చేసుకోవాలని ఆరాటపడుతున్నారని కేటీఆర్ పదే పదే చెప్పడమే దీనికి నిదర్శనం. ఇక ఏపీలో కూడా ప్రజలు చంద్రబాబుకి ఓటు వేసి బాధపడుతున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈసారి గెలిచేది జగనేనని ఆ పార్టీ నేతలు నమ్మకంగా చెబుతుంటారు. అంటే అక్కడా ఇక్కడా నాయకులు ఓడిపోయి, ప్రజలు పొరపాటు చేశారని, తమను ఓడించిన తర్వాత తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడుతున్నారని వారు తీర్మానించేశారు.
అసెంబ్లీకి రావడంలో కూడా..
ఈ విషయంలో కేసీఆర్ కాస్త నయం. అప్పుడప్పుడు అసెంబ్లీకి వస్తుంటారు. కానీ జగన్ మాత్రం తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వచ్చేది లేదని మారాం చేస్తున్నారు. తనతోపాటు తన పార్టీ ఎమ్మెల్యేలెవర్నీ అసెంబ్లీకి రాకుండా జగన్ కండిషన్ పెట్టడం ఇక్కడ మరో విశేషం.
Also Read: ఆ ఒక్కటి పూర్తయితే ఉత్తరాంధ్రలో టీడీపీకి తిరుగుండదు
మొత్తమ్మీద అధికారంలోకి రావాలని ప్రతిపక్షంలో ఉన్న ఎవరికైనా ఆశ ఉంటుంది. కానీ ఎన్నికలైపోయి, ఓటమి ఎదురైన తెల్లారే ఆ స్టేట్ మెంట్ ఇవ్వడం, ప్రభుత్వంలో ఉన్న పార్టీని, లేదా పార్టీలను మరీ తక్కువ అంచనా వేయడం కేసీఆర్, జగన్ కే చెల్లిందనే విమర్శలు వినపడుతున్నాయి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అనిపించుకోవడం అక్కడ కేసీఆర్ కి నామోషీ అయితే, ప్రతిపక్ష నేత అనే ట్యాగ్ లైన్ లేకుండా ఏపీ అసెంబ్లీకి వెళ్లడం ఇక్కడ జగన్ నామోషీగా భావిస్తున్నారు.
Also Read: పవన్ కల్యాణ్ కి కోపం తెప్పించిన డీఎస్పీ