Diwali Eye effected: హైదరాబాద్ లో దీపావళి పండుగ నాడు టపాసులు పేల్చే సమయంలో ప్రమాదవశాత్తు అనేక మందికి కంటి గాయాలు అయ్యాయి. కంటి గాయాలైన వారు మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూకట్టారు. 20 మంది పిల్లలు సహా మొత్తం 54 మంది కంటి గాయాలతో ఆసుపత్రికి వచ్చారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించారు.
దీపావళి పండుగ సందర్భంగా గత మూడు రోజుల్లో కంటి గాయాలతో పదుల సంఖ్యలో సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎక్కువ మందికి అధిక డెసిబెల్ మిర్చి బాంబుల కారణంగా గాయాలు సంభవించాయి. దాదాపు 80% కేసులు పటాకుల కారణంగా ఏర్పడినవే ఉన్నాయి. పండుగ సమయాల్లో అత్యంత తీవ్రమైన కంటి గాయాలు అవుతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
గాయపడిన వారిలో ఎక్కువ మందిని ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి పంపించామని వైద్యులు తెలిపారు. తీవ్ర గాయాలైన వారిని ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలు చికిత్స చేస్తున్నామన్నారు. ఏడుగురు వైద్యుల బృందం గాయపడిన వారికి చికిత్స చేస్తున్నారు. కొంతమంది పటాకులు పేల్చేటప్పుడు గాయపడగా, మరికొందరు పటాకులను దగ్గరగా వెలిగించిన క్రాకర్ల వల్ల గాయపడ్డారని వైద్యులు తెలిపారు.
“గత మూడు రోజులుగా మొత్తం 54 మంది కంటి గాయాలతో ఆసుపత్రికి వచ్చారు. వీటిలో 23 కేసులు తీవ్రమైనవి. 23 మందిలో నలుగురిని ఆసుపత్రిలో చేర్చారు. ముగ్గురిని శస్త్రచికిత్స కోసం తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి మళ్లీ దృష్టి వస్తుందో, కోలుకుంటారో లేదో ఈ దశలో మేము చెప్పలేము. విషమంగా ఉన్న ఇద్దరిలో ఒకరు పిల్లవాడు, మరొకరు పెద్దవాడు” అని వైద్యులు అన్నారు.
Also Read: హుజూర్‌నగర్‌లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్!
గాయపడిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల చెందిన వారే ఉన్నారు. సాధారణంగా దీపావళి మరుసటి రోజు లేదా రెండు రోజుల తరువాత కూడా కంటి సమస్యలతో వస్తారన్నారు. ‘ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 20 మంది పిల్లలు ఉన్నారు. 30 నుండి 45 సంవత్సరాల వయస్సు గల వారు ఎక్కువగా గాయపడ్డారు’ అని వైద్యులు తెలిపారు.