Jubilee Hills By-Election: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి మరో అంకం మొదలైంది. మంగళవారంతో నామినేషన్లు ముగిసింది. దీంతో ప్రచారానికి రెడీ అవుతున్నాయి రాజకీయ పార్టీలు. ఇప్పటికే పార్టీలు స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించాయి. దీంతో ఒక్కసారిగా ఉప ఎన్నిక వేడి తారాస్థాయికి చేరింది.
వేడెక్కిన జూబ్లీహిల్స్ బైపోల్
జూబ్లీహిల్స్ బైపోల్‌లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. దీంతో రాజకీయపార్టీల నేతలు ఏయే రోజుల్లో ప్రచారం చేయాలన్న దానిపై ఆయా నేతలు చర్చించుకుంటున్నారు. బుధవారం నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో ఎక్కువ మంది ప్రచారాన్ని ప్రారంభించనుంది. గతంలో మాదిరిగా ఈసారీ ఇంటింటి ప్రచారం చేయాలని భావిస్తోందట.
సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ మొదటివారంలో ప్రచారంలోకి వచ్చే అవకాశమున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇంకోవైపు మంత్రులు, పార్టీ కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు.
ప్రచారంలోకి దిగనున్న ప్రధాన పార్టీల నేతలు
ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్. సిటీలో తమకు పట్టు ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకోసం రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని నేతలు జూబ్లీహిల్స్‌లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాము విజయం సాధిస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రచారంలోకి దిగితే తమకు సానుకూల ఫలితాలు వస్తాయని కొండంత ఆశలు పెట్టుకుంది బీఆర్ఎస్.
2023లో జరిగిన ఎన్నికల్లో పాతిక వేల ఓట్లు సాధించింది బీజేపీ. ఈసారి మాత్రం సీటుపై కన్నేసింది. ఇందుకోసం స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దించింది. రెండువారాలపాటు జోరుగా ప్రచారం చేసి సీటు కాకున్నా, కనీసం సెకండ్ ప్లేస్‌లో నిలవాలని ఆలోచన చేస్తోంది. అదే జరిగితే సిటీపై పార్టీకి పట్టు పెరుగుతుందని, వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావచ్చని భావిస్తోంది. ఆ పార్టీ కీలక నేతలు వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు.
ALSO READ: దీపావళి టపాసుల ఎఫెక్టు.. కంటి సమస్యతో సరోజినీదేవి ఆసుపత్రికి బాధితులు
ఇలా ఎవరికివారు నేతలు ప్రచారంలో నిమగ్నం కానున్నారు. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు ఎలాంటి వ్యూహాలను అవలంభించాలనే దానిపై ఓ వైపు జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. దాదాపు రెండువారాలపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైకులు రీసౌండ్ చేయనున్నాయి. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి.
చివరి రోజు మంగళవారం ఒక్కరోజు 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లు దాఖలు వేశారు. ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఇవాళ నామినేషన్లను పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. నామినేషన్లల ఉపసంహారణకు ఈనెల 24తో గడువు ముగియనుంది. నవంబర్ 9న ప్రచారం ముగియనుంది. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది.
మంగళవారం నామినేషన్లు దాఖలు చేసినవారిలో రీజనల్ రింగ్ రోడ్డు, ఫార్మాసిటీ భూనిర్వాసితులు, నిరుద్యోగులు భారీగా ఉన్నారు. దాదాపు 11 మంది రైతులు తమతమ నామినేషన్‌లు దాఖలు చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ నుంచి 30 మంది నామినేషన్‌లు దాఖలయ్యాయి. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి 11 మంది నామినేషన్‌లు చేశారు. వివిధ వర్గాలు ప్రజలు భారీగా నామినేషన్లు దాఖలు చేయడంతో ప్రధాన పార్టీలకు వణుకు మొదలైంది. ఎక్కువ మంది బరిలో ఉంటే ఎలాంటి గుర్తులు కేటాయిస్తారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.