DGP Shivadhar Reddy: ప్రభుత్వం, పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని, ధైర్యంగా ఉండాలని.. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి బాధిత కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబీకులకు భరోసా కల్పించారు. ఇటీవల రియాజ్ అనే నేరస్థుడిని పట్టుకునే క్రమంలో.. దారుణంగా హత్యకు గురైన సీ.సీ.ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ నివాసానికి స్వయంగా వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు నేను ఇక్కడికి వచ్చాను. ప్రమోద్ కుమార్ మరణం పోలీసు శాఖకు పెద్ద నష్టం. ఆయన విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారు అని తెలిపారు.
డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రమోద్ కుమార్ కుటుంబానికి రూ. 1 కోటి ఎక్స్ గ్రేషియా, 300 గజాల ఇంటి స్థలం, పెన్షన్, అలాగే కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. ప్రమోద్ కుమార్ విధుల్లో నిబద్ధతతో, అందరితో మమేకంగా పనిచేసే నిజాయితీ గల పోలీసు అధికారి అని ఆయన స్మరించారు.
తర్వాత కమిషనరేట్ కార్యాలయంలో.. డీజీపీ శివధర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కలిసి పోలీసు అమరవీరుల తొమ్మిది కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. 1989 నుండి ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో 18 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారు. వారిలో తొమ్మిది కుటుంబాలకు గన్నారం గ్రామ శివారులో 300 గజాల చొప్పున స్థలాలు కేటాయించాం. మిగిలిన కుటుంబాలు ముందుకు వస్తే, వారికీ అదే విధంగా స్థలాలు ఇస్తాం అని తెలిపారు.
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పూర్తి సహకారం అందించడంపై డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను రక్షించే పోలీసుల కుటుంబాలకు.. ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని ఆయన అన్నారు. ఇటీవల గాజులరామారంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా.. 200 గజాల చొప్పున స్థలాలను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 2008లో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వద్ద మావోయిస్టు దాడిలో అమరులైన 33 మంది పోలీసు కుటుంబాలకు నివాస స్థలాలు కేటాయించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరోపకార చిహ్నంగా గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రమోద్ కుమార్ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న సారంగాపూర్‌కు చెందిన సయ్యద్ ఆసిఫ్‌కి హోంగార్డు ఉద్యోగం ఇవ్వాలని.. పోలీసు శాఖ పరిగణనలోకి తీసుకోవాలి అని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి సానుకూలంగా స్పందించి, త్వరలోనే హోంగార్డు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆ సందర్భంగా సయ్యద్ ఆసిఫ్‌కు అవకాశాన్ని కల్పించేలా చర్యలు తీసుకుంటాం అని భరోసా ఇచ్చారు.
కార్యక్రమానికి ముందు సుభాష్ నగర్‌లోని పోలీసు విశ్రాంతి గృహం వద్దకు చేరుకున్న డీజీపీకి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య తదితరులు పూలమొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
ప్రతి పోలీసు అమరవీరుడు మన సమాజ భద్రత కోసం ప్రాణాలు అర్పించాడు. వారి త్యాగం వృథా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం నిరంతరం వారి కుటుంబాల పట్ల బాధ్యతగా ఉంటుంది అని హామీ ఇచ్చారు.