KTR Challenges: స్వేచ్ఛ బ్యూరో: కేసీఆర్ పుట్టిన 1954 నుంచి నేటి వరకు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇరు కుటుంబాల ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. సీఎంకి దమ్ముంటే ఈ సవాల్ ను స్వీకరించి వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు.
మీడియాతో మాట్లాడుతూ..
అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే సొంత సిట్‌లు, సెట్‌లు కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ వైపు ఏ తప్పైనా బయటపడితే చట్టపరంగా ఎలాంటి శిక్షకైనా తాము సంపూర్ణంగా సిద్ధమని ప్రకటించారు. గతంలో వెయ్యి సార్లు 1000 ఎకరాల ఫామ్‌హౌస్ అని, నిన్న అసెంబ్లీలో 67 ఎకరాలని స్వయంగా సీఎం అంగీకరించారని, మిగిలిన 933 ఎకరాలు ఎక్కడున్నాయో చూపిస్తే వాటిని ప్రభుత్వానికే రాసిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లలోనే ఈ భూముల వివరాలను వెల్లడించారని, ఆదాయపు పన్ను, స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవసాయ భూమి అని స్పష్టం చేశారు. ఇంతకాలం వాటిపై తప్పుడు ప్రచారం చేసి బురదజల్లినందుకు కేసీఆర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌కు సవాల్..
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ముమ్మాటికీ బోగస్ అని వెయ్యిరోజుల విఫల పాలన చూసిన తరువాత తేలిపోయిందన్నారు. వీటిపై నిలదీస్తామన్న భయంతోనే ప్రధాన ప్రతిపతిక్షమైన బీఆర్ఎస్ ను సభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. సభలో ప్రధాన ప్రతిపక్షాన్ని లేకుండా చేసి బీజేపీతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి అసెంబ్లీని ఏకపక్షంగా నడిపించుకుంటున్నారని ఆరోపించారు. ‘తన కళ్లల్లో కళ్లు పెట్టి చూసే ధైర్యం ప్రతిపక్షానికి లేదని చెప్పిన సీఎంకు సవాల్ విసురుతున్నా.. ధైర్యముంటే శాసనసభ సమావేశాలను నెల రోజుల పాటు పొడిగించి, మాపై పెట్టిన అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయండి.. కళ్లల్లో కళ్లు పెట్టి చూడటం కాదు, 420 హామీల మోసంపై తెలంగాణ ప్రజల పక్షాన నిలదీస్తాం’అని హెచ్చరించారు. ఒక మనిషి చేతిలో ఒక్కసారి మోసపోతే అది ఎదుటివారి తప్పవుతుందని, కానీ అదే వ్యక్తి పదేపదే చెప్పే అబద్ధాలు, పుక్కిటి పురాణాలు విని మోసపోతే అది ప్రజల తప్పే అవుతుందని పేర్కొన్నారు.
ప్రజాసమస్యలపై చర్చ..
చట్టసభల్లో అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు హుందాగా, పెద్దరికంతో మాట్లాడాలే తప్ప అసత్యాలు, అర్ధసత్యాలతో ప్రజలను, రాష్ట్రాన్ని, శాసనసభను తప్పుదోవ పట్టించడం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో, ఆరు గ్యారెంటీలు ఏ మేరకు అమలయ్యాయో, నిన్నటి ముఖ్యమంత్రి ప్రసంగం కూడా అంతే వాస్తవరూపమని, మైసూరు బజ్జీలో ఎంతైతే మైసూరు ఉంటుందో సీఎం మాటల్లోనూ అంతే నిజముందని దుయ్యబట్టారు. ఆరు నెలల గడువు ముగుస్తుందన్న అనివార్య పరిస్థితుల్లోనే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిందని, ప్రజాసమస్యలపై చర్చ జరుగుతుందని ఆశించిన అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఘోరంగా వంచించిందని పేర్కొన్నారు.
సాగర్ నుంచి నీటిని ఆంధ్రాకు..
రైతులకు కనీసం 6 గంటల నిరంతర విద్యుత్ కూడా అందక సబ్‌స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాలు చేస్తుంటే, పరిశ్రమలు వారంలో 30 శాతం సమయం జనరేటర్ల మీదే నడపాల్సి వస్తోందని పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సాగర్ నుంచి నీటిని ఆంధ్రాకు తరలిస్తూ సాగర్ ఎడమ కాలువ రైతులకు నీరివ్వకుండా పంటల ప్రణాళికపై స్పష్టత లేకుండా చేశారని, కేసీఆర్ హయాంలో 510 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే నీళ్లిస్తే, నేడు 530 అడుగుల పైబడి ఉన్నా నీరివ్వడం లేదని మిర్యాలగూడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రీమియం కట్టకుండా ప్రభుత్వం రైతుబీమాను ఎందుకు రద్దు చేసిందో సమాధానం చెప్పడం లేదని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మూడేళ్లయినా కనీసం 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా జాబ్ క్యాలెండర్‌ను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు.
అధికారిక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
సిరిసిల్ల పట్టణంలో నిరుపేదలకు, కార్మికులకు దశాబ్దాల క్రితం ఇచ్చిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జా భూములుగా చిత్రీకరించడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ ధ్వజమెత్తారు. స్వయంపాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీవో 58, 59 కింద ఆ పేదల స్థలాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తే, దాన్ని నేడు సీఎం కబ్జా అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ నెలాఖరుకు సిరిసిల్లకు వస్తానంటున్న సీఎం, సిరిసిల్లలో 8,000 ఎకరాలు ఎక్కడ ఉన్నాయో, ఏ సర్వే నంబరో, ఏ ఊరో, ఎవరు కబ్జా చేశారో సమగ్ర వివరాలతో ఒక అధికారిక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కేవలం 30 శాతం కమీషన్లు దండుకోవడానికే ప్రభుత్వం 22(ఏ) నిషేధిత జాబితా అనే దుర్మార్గమైన వ్యవస్థను తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి ఒక్క గజమైనా ఇచ్చారా..
కోటి ఎకరాల నిషేధిత భూముల్లో 30 లక్షల ఎకరాల ప్రైవేట్ భూములున్నాయని స్వయంగా సీఎం ఒప్పుకున్నారని, తప్పు ప్రభుత్వం చేసి సామాన్య ప్రజలను నిరూపించుకోమనడం వెనుక భారీ వసూళ్ల దందా దాగి ఉందని ఆరోపించారు. బలహీన వర్గాల ఆత్మగౌరవ భవనాల కోసం కోకాపేటలో ఎకరం రూ.200 కోట్ల విలువ చేసే 75 ఎకరాల భూమిని (సుమారు రూ. 15,000 కోట్ల ఆస్తి) కేసీఆర్ కేటాయించినట్లు రేవంత్ రెడ్డి ఒక్క గజమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ గారు భూమిని బడుగుల ఆత్మగౌరవానికి ఒక సాధనంగా చూస్తే, రేవంత్ రెడ్డి మాత్రం భూమిని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపార వస్తువుగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్ల క్రితం సెప్టెంబర్ 17న కేసీఆర్ గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడమే కాకుండా, బంజారాహిల్స్‌లో సుమారు రూ. 400 కోట్ల విలువైన రెండెకరాల స్థలంలో బంజారా భవన్, కొమురం భీమ్ భవనాలను నిర్మించి ఇచ్చారని గుర్తుచేశారు.
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి
కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం కాక, పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నారని తెలిపారు. పుట్టుకతోనే వందల ఎకరాల ఆస్తి ఉన్న కుటుంబంలో జన్మించి, 72 ఏళ్ల వయస్సులో నేడు 67 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటుంటే ఆయన ఆస్తులు పెరిగినట్టా, తరిగినట్టా అని సూటిగా ప్రశ్నించారు. వట్టినాగులపల్లి, నాదర్‌గుల్‌లో 379 ఎకరాల భూ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే ‘ధరణి’ని రద్దు చేసి ‘భూభారతి’ తెచ్చారని ఆరోపించారు. అసెంబ్లీ వ్యవహారాల్లో పార్ట్-2 లో‘కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా తిరిగి వస్తారు, సీక్వెల్ అదిరిపోతుంది చూసుకోండి’అని ధీమా వ్యక్తం చేశారు.
బటన్లు నొక్కి మా ఆస్తులేవో బయటపెట్టు..
తన తొత్తులతో విచారణలు చేయించి, అనుకూల పత్రికల్లో రాయించుకుని శునకానందం పొందడం తప్ప ఫామ్‌హౌస్‌పై విచారణ కమిటీలో ఏమీ లేదన్నారు. అధికారం మొత్తం నీ చేతుల్లోనే ఉన్నప్పుడు బటన్లు నొక్కి మా ఆస్తులేవో బయటపెట్టి, శ్వేతపత్రం వేసి చర్యలు తీసుకోవచ్చు కదా” అని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వంటి పసలేని ఆరోపణలు మరో 10-15 సృష్టించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ 420 మోసాలు, వెయ్యి రోజుల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ చేసే కుట్రలను బీఆర్‌ఎస్ పార్టీ ప్రజలతోనే కలిసి గట్టిగా తిప్పికొడుతుందని స్పష్టం చేశారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డిపై రెడ్ బుక్ రాస్తున్నాం.. ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు!