Keesara Bribe Case: రేషన్ బియ్యం కేసులో రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ కీసర సీఐ, ఎస్ఐ.. ఏసీబీ అధికారులకు పట్టుబట్టారు. లంచంతో మద్యం, బిర్యానీలు, కూల్ డ్రింక్స్ తేవాలని కొద్ది రోజులుగా బాధితుడ్ని వేధించడంతో తట్టుకోలేక అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకొని సీఐ, ఎస్సైని కటకటాల్లోకి పంపారు. దీంతో స్థానికులు స్టేషన్ ఎదుట సంబురాలు చేసుకున్నారు.
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ గా అర్కపల్లి ఆంజనేయులు పని చేస్తున్నారు. ఇదే స్టేషన్ లో జ్ఞానేందర్ రెడ్డి ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పేదలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని వారు అరెస్ట్ చేశారు. అతని నుంచి బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు కూడా నమోదు చేశారు. కాగా ఈ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించకుండా ఉండాలంటే 10 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలని సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి కలిసి నిందితున్ని డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇచ్చుకోలేనని సదరు వ్యక్తి చెప్పటంతో చివరకు రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.
అంతటితో ఆగకుండా నిందితుడ్ని అసభ్యకర పదజాలంతో దూషిస్తూ మద్యం, బిర్యానీ, కూల్ డ్రింక్స్ తీసుకురావాలంటూ ఆర్డర్లు వేయటం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన సదరు వ్యక్తి.. సీఐ, ఎస్ఐ కలిసి తనను లంచం డిమాండ్ చేశారంటూ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో సీఐ, ఎస్ఐలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటానికి ఏసీబీ అధికారులు వలపన్నారు. గురువారం కీసర చెరువు వద్ద ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి విధుల్లో ఉండగా బియ్యం అక్రమ రవాణాదారు అక్కడికి వెళ్లాడు. రూ.5 లక్షలు తెచ్చినట్టు చెప్పాడు. వెంటనే అతన్ని తన కారులోకి తీసుకెళ్లిన ఎస్సై లంచం డబ్బు తీసుకోగానే ఏసీబీ అధికారులు దాడి చేశారు.
అయితే, వారిని చూసిన ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి తప్పించుకోవటానికి మరోవైపు నుంచి కారు దిగి పరుగులు పెట్టాడు. దీంతో ఏసీబీ అధికారులు అతన్ని వెంటాడి మరీ పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న రూ.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో సీఐ ఆంజనేయులు చెప్పిన మేరకే తాను లంచం డబ్బు తీసుకున్నానని ఎస్ఐ వెల్లడించారు. దాంతో సీఐ ఆంజనేయులును కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: 76వ పుట్టినరోజు వేళ.. మోదీపై జార్జియా మెలోని ఆసక్తికర పోస్ట్.. ఇంతకీ ఏమన్నారంటే?
మరోవైపు సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరి ఆగడాలు కొన్నిరోజులుగా మితిమీరి పోయాయని వ్యాఖ్యానించారు. స్థానిక కాంగ్రెస్ నేతలతోపాటు జనం పోలీస్ స్టేషన్ ముందు బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. ఏసీబీ అధికారుల చర్యలను అభినందిస్తూ నినాదాలు చేశారు.
Also Read: ప్యారడైజ్ విషయంలో కీర్తి సురేష్ సీరియస్.. అసలు మ్యాటర్ చెప్పిన నాని!