Nagarkurnool: నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి మొదటి సారి పోటీ చేసి గెలిచిన కూచుకుల రాజేష్‌రెడ్డి గులాబీ కోటను బద్దలు కొట్టారు. మొదటి సారి గెలిచినా అభివృద్ధి విషయంలో అందరి అంచనాలను మించి జెట్ స్పీడ్ లో పనులు చేస్తున్నారు రాజేష్‌రెడ్డి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1000 కోట్ల రూపాయల నిధులు ఒక్క ఆ నియోజకవర్గ అభివృద్ధికి వచ్చాయి అంటే ఆయన నాగర్‌కర్నూల్ అభివృద్ధి విషయంలో ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థమవుతోంది.. అయితే అన్ని నిధులు వచ్చినా వాటి గురించి ప్రజలకు తెలియదంట.. అసలింతకీ నాగర్‌కర్నూల్ అభివృద్ది విషయంలో రాజేష్‌రెడ్డి వ్యూహమేంటి?
నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్‌కు తిరుగు లేదనుకున్న చోట పరిస్థితి తారుమారయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి పాగా వేసిన ఆ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేదే ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆశ్చర్యానికి గురిచేస్తుందట. గులాబీ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఎట్టకేలకు కాంగ్రెస్ 30 ఏళ్ల తరువాత జెండాను ఎగరవేసింది. కానీ ఆ పార్టీలో ఇప్పుడు తీవ్ర అసహనం కనబడుతుందట. నాగర్ కర్నూల్‌లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా రెండుసార్లు వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, అలాగే ఆయన వెనక రాజకీయ ఉద్దండుడు మాజీ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో నెంబర్ 2 స్తానంలో వెలుగు వెలిగిన నేత నాగం జనార్ధన్ రెడ్డి ఉన్నారు. ఆ ఇద్దరు జనార్ధనులను కాదని మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కూచుకుళ్ల రాజేష్‌రెడ్డిని నాగర్‌కర్నూలు ఓటర్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.
విద్యావంతుడు డాక్టర్‌గా సేవలు అందించిన వ్యక్తి కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయన తన పని తను సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1,000 కోట్ల నిధులు కేవలం గడిచిన 20 నెలల కాలంలోనే అభివృద్ధి చేసేందుకు నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి మంజూరు చేయించారు. నియోజకవర్గంలోని గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, దుందుభి నదిపై బ్రిడ్జి, స్కూల్ నిర్మాణాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్, పల్లె దవాఖానలు, గ్రామ పంచాయతీ భవనాలు, మెడికల్ కాలేజీ, నూతన జూనియర్ కళాశాల భవనం నిర్మాణం , నియోజకవర్గంలో ఉన్న దేవాలయాల కోసం నిధులు మజురు చేయించారు.
అలాగే అంగన్వాడీ భవనాలు, విద్యుత్ ఉప కేంద్రాలు, నాగర్ కర్నూల్ కి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయించారు. కానీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో సోషల్ మీడియా ప్రచారంలో విఫలం అవుతున్నారనే టాక్ విస్తృతంగా వినిపిస్తోంది. రూ.1000 కోట్ల అభివృద్ధి నిధులు వచ్చినా.. వాటిని ప్రచారం చేసుకోవడం లేదు. కేవలం ఫోటోలకే పరిమితమై, చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం లేదంటున్నారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ అభివృద్ధి చేసేందుకు పడిన కష్టమంతా కేవలం ఫోటోలకే మాత్రమే పరిమితం అవుతుందనే చర్చ నడుస్తుంది. తన కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదనేది ఆయన సన్నిహితులు నుంచి వస్తున్న మాట. ఎన్ని నిధులు తెచ్చినా ఆ విషయం ప్రజల వరకు చేర్చే సోషల్ మీడియా ప్రచారంలో ఆయన వైఫల్యం చెందుతున్నారంట. కేవలం ఎమ్మెల్యే పర్యటనకు సంబంధించిన ఫోటోలు గంప గుత్తుగా ఆ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసి చేతులు దులుపుకుటున్నారట. చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చేరవేసే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సమాచారం చేరవేసే ప్రయత్నం చేయడంలో అనుచరులు విఫలమవుతున్నారట.
అభివృద్ధిపై నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై నెగిటివ్ టాక్..
దీంతో నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి ప్రజలకు చేరడం లేదు అసలు నియోజకవరగంలో అభివృద్ధి జరుగుతుందా అన్న అనుమానాలతో ప్రజల్లో ఎమ్మెల్యేపై వ్యక్తిరేకత టాక్ వెళ్తుందనే టాక్ నడుస్తోందట. జరిగిన అభివృద్ధిపై నిత్యం ప్రజల్లో ప్రచారం చేయాల్సిన సోషల్ మీడియా నిద్ర వ్యవస్థలో ఉండడంతో…ఇదే అనువుగా భావించిన బీఆర్ఎష్ నేతలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం లేదని జరుగుతున్నదంతా కేవలం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి అంటూ విసృతంగా ప్రచారం చేసుకుంటున్నారట. దీని వల్ల ఎమ్మెల్యే పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ జనాలకు వెళ్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఫీలవుతున్నారట. కేవలం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రసంగంలో అభివృద్ధిపై మాట్లాడిన మాటలు, పాజిటివ్ మాటలు వదిలి నెగిటివ్ ప్రచారం జరిగేలా వీడియోలను సోషల్ మీడియా గ్రూప్ లలో పోస్ట్ చేస్తున్నారు. వాటిని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతుంది.
Also Read: MGBS నుంచి బస్సుల రాకపోకలలు నిలిపివేత..! ఏ బస్సు ఏ రూట్లో వెళ్తుందంటే..?
ఈ నెగిటివ్ టాక్ ఇలాగే ప్రజల చెంతకు చేరితే రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టి తను చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ వర్గాలు కోరుతున్నాయి. లేక పోతే రాబోయే రోజుల్లో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పదంటున్నారు. ఎమ్మెల్యే కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఇప్పటికైనా తన సోషల్ మీడియా విభాగాన్ని సెట్ రైట్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి..
Story By vamshi Krishna, Bigtv