Kumbh Mela : ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక కార్యక్రమం అయిన కుంభమేళ చివరి దశకు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది.. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికొందరు ఇప్పటికీ ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. వారిలో హైదరాబాద్ వంటి సంపన్న నగరాల నుంచి ఉన్నత వర్గం ప్రజలు భారీగానే ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. భారీగా అంటే మామూలు భారీగా కాదు.. ఏకంగా ఒక్కో ట్రిప్ నకు రూ.15 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారంట. ఏంటీ.. ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారా.?. అయితే.. ఇంకో విషయం వీళ్లు ఎన్ని లక్షలు పెట్టినా, ప్రయాగ్ రాజ్ కు వెళ్లేందుకు ప్రైవేట్ జెట్లు, హెలీకాప్టర్లు దొరకడం లేదంటా.. అంటే మధ్యతరగతి జనాని సంక్రాంతికి బస్సులు నిండిపోయినట్లు.. కుంభమేళ పుణ్యమా అని అన్ని ప్రైవేట్ జెట్లు ఫుల్ డిమాండ్ తో నడుస్తున్నాయంట.
ఫిబ్రవరి 26న కుంభమేళ ముగిసిపోతుంది. ఇన్నాళ్లు వివిధ కారణాలతో పవిత్ర సంగమంలో స్నానం ఆచరించలేకపోయిన ధనవంతులు.. ఇక ఇప్పుడు సంగమంలో పవిత్ర స్నానం కోసం డబ్బుల్ని నీళ్లలా ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడడం లేదంటా. గత కొన్ని రోజులుగా వరుసపెట్టి వస్తున్న ఆర్డర్ల గురించి ఓ బుకింగ్ ఏజెన్సీ చెప్పిందీ విషయం. కుంభమేళ చివరికి చేరుకునేంటప్పటికి.. డిమాండ్ పెరుగుతుందని చెబుతున్న ట్రావెల్ అండ్ బుకింగ్ ఏజెన్సీలు.. గత కొన్ని వారాల్లో హైదరాబాద్‌లోని వ్యాపార, రాజకీయ, టెక్ రంగాలకు చెందిన ప్రముఖుల బుకింగ్స్ తో 25-30 ట్రిప్పుల వరకు ప్రయాగ్ రాజ్ వెళ్లొచ్చినట్లు చెబుతున్నారు. ఇక.. ఈ రెండు రోజులు అయితే.. ధరలు మరింత పెరగగా.. అయినా ఆయా వర్గాలు వెనక్కి తగ్గడం లేదని సమాచారం. పవిత్ర సంగమంలో స్నానం చేసేందుకు ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధపడుతున్నారంట. ఈ డిమాండ్ ను ముందే అంచనా వేసిన కొన్ని సంస్థలు.. వివిధ రకాల విమానాల్ని లీజుకు తీసుకున్నాయంట.
హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి.. ప్రైవేట్ జెట్ లో వెళ్లేందుకు సుమారు 1 గంట 45 నిమిషాలు పడుతుంది. అక్కడి నుంచి సంగమం దగ్గరే కావడంతో.. ఒక్కరోజులోనే త్రివేణి సంగమంలో స్నానం చేసి వచ్చేయొచ్చు. ప్రస్తుతం ఓ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి 6 సీట్ల టర్బోప్రాప్ విమానం రెంట్ కు తీసుకోవాలి అనుకుంటే.. రూ.15 లక్షలకు పైగానే చెల్లించుకోవాల్సి ఉంటుంది. అదే 8-సీట్ల జెట్ లో ఓ కుటుంబం వెళ్లి రావాలి అనుకుంటే మాత్రం రూ.30 లక్షలు, పన్నులు చెల్లించాల్సిందే అంటున్నారు. అదే.. ఓ రెండు, మూడు కుటుంబాలు కలిసి వెళ్లాలి అంటే మాత్రం.. 13-సీట్ల జెట్ బుక్ చేసుకుంటున్న ఐశ్వర్యవంతులు ఇందు కోసం రూ.45 లక్షలు చెల్లిస్తున్నారు. కుంభమేళ చివరి దశకు చేరుకోవడంతో.. ఈ ధరలు మరింత భారీగా పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ధనవంతుల నుంచి వస్తున్న డిమాండ్‌ను బట్టి చూస్తే… ధరలు మరో 20% నుంచి 30% వరకు పెరగడంలో పెద్దగా ఆశ్చర్యం లేదంటున్నారు బెంగళూరుకు చెందిన థంబీ ఏవియేషన్ CEO గోవింద్ నాయర్. ఆయన సంస్థ మహా కుంభ్ కోసం ప్రభుత్వ అధికారులు, ఫార్మా కంపెనీల అధిపతులు, టెక్ రంగ నాయకులు, రాజకీయ ప్రముఖులకు హెలికాప్టర్లను అద్దెకు ఇస్తోంది. ప్రస్తుత రద్దీ నేపథ్యంలో.. వారి సంస్థ ఒక్క రోజులోనే మూడు నుంచి నాలుగు ట్రిప్పులు నిర్వహిస్తోందని చెప్పారు. హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ఘాట్ హెలిప్యాడ్ (త్రివేణి సంగమం సమీపంలో) వరకు హెలికాప్టర్‌లో తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
Also Read : Rs.500 Notes : పొలంలో నోట్ల కట్టలు.. షాకైన రైతులు, ఇంతలో ఊహించని ట్విస్ట్
కుంభమేళ నుంచి విమానాశ్రయానికి తిరుగు ప్రయాణంలో ఒక్కో సీటుకు దాదాపు ₹33,000 ఖర్చవుతుందని తెలుపుతున్నారు. అయితే.. విమానాశ్రయం నుంచి ఘాట్ వరకు దూరం సుమారు 12 కిలోమీటర్లు మాత్రమే. అధిక ధరలున్నా, మహా కుంభ్ డిమాండ్ ఉన్నా.. వ్యాపారం మాత్రం భారీ లాభదాయకంగా లేదంటున్నాయి విమానయాన సంస్థలు. పరిమిత హెలిప్యాడ్‌లు, పార్కింగ్ సమస్యలు వంటి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ప్రయాగ్ రాజ్ విమానాశ్రయానికి విమానాల రద్దీ భారీగా ఉండటంతో.. ఒక రాత్రి ఉండాలంటే హెలికాప్టర్లను వారణాసి, అయోధ్య లేదా లక్నోకి తీసుకెళ్లి పార్కింగ్ చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని.. అలా లాభాల్లో భారీగా కోత పడుతున్నట్లు చెబుతున్నారు.